సోషల్ మీడియా ప్రపంచం నిర్దాక్షిణ్యంగా, ప్రమాదకరంగా మారిందని.. దాన్ని నియంత్రించడం కష్టం కాబట్టి పిల్లల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి గజ్జల వెంకట లక్ష్మి సూచించారు. ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియోపై ప్రణీత్ హన్మంతు అనే యూట్యూబర్, అతడితోపాటు మరో ముగ్గురు కలిసి.. వికృతమైన లైంగిక కోణంలో వక్రదృష్టితో చూస్తూ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా సోషల్ మీడియా వేదికగా దారుణ వ్యాఖ్యలు చేశారు. వారిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన ఈ ఉదంతం పై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి గజ్జల వెంకట లక్ష్మి మంగళవారం తీవ్రంగా స్పందించారు. ఇలాంటి సోషల్ మీడియా సైకోలపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇలాంటి రాక్షస వికృత చర్యలను ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు. డార్క్ కామెడీ పేరిట సామాజిక మాధ్యమాలలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న అతడి ప్రవర్తన అసహ్యకరం, అత్యంత ప్రమాదకరమని గజ్జల లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ కంటెంట్‌పై ప్రభుత్వాలు నియంత్రణ విధించే సమయం ఆసన్నమైందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.