కొందర్ని నిర్వచించాలంటే పదాలు వెతుక్కోవాల్సిందే. వీళ్లు అసలు భూమ్మీద ఎలా పుట్టారు! స్వార్థం.. మాత్రమే ఉండే చోట ఇంతగొప్ప వ్యక్తిత్త్వంతో ఎలా ఎదిగారనిపిస్తుంది. సినిమా రంగంలో భిన్నపార్శ్వాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అల్లాడుతుంటే తన ధ్యాస సినిమా.. పక్కోడి ప్రైవసీను దెబ్బతీసి క్షుద్రానందం పొందటం. మరోవైపు జనం కష్టాల్లో ఉన్నపుడు సగటు మనిషిలా స్పందించటం. అసలు తన వద్ద ఎంత డబ్బుందో.. అప్పులు తెచ్చి మరీ సాయం అందిస్తున్నాడో తెలియదు. కానీ.. ఆపద అనే మాట వినిపించిన ప్రతిచోట నేనున్నా!నంటూ స్పందిస్తున్నాడు. యావత్ భారతదేశంలో కేవలం మంచిమనసుతో స్పందించి ఇంతగా జనాధరణ పొందిన వ్యక్తి మరొకరు ఉండరేమో అనేంతగా సోనూసూద్ సామాన్యుడి హీరో అయ్యాడు. మహమ్మారి కరోళనృత్యం చేస్తుంటే.. బంకర్ల సందుల్లో.. విల్లా గదుల్లో కూర్చున్న ఎంతోమంది హీరోలను మించిన హీరోయిజం చూపిన సోనూసూద్.. లాక్‌డౌన్ విరమించకుముందు నుంచే పేదింట తాను మెతుకై ఆకలి తీర్చాడు. ఎన్నో వేల మంది వలసకూలీలు సొంతూళ్లకు వెళ్తుంటే. తాను కరిగిపోయాడు. కులం, మతం ప్రాంతం అనే బేధం లేకుండా.. కూలీలు ఇంటికెళ్తానంటే తన భుజాల్ని వారికి తోడ్పాటును నిచ్చాడు. బతుకుదెరువు కోసం మీరెక్కడ చిక్కినా చిన్న ఫోన్‌కాల్ చేయమంటూ ఏకంటా టోల్‌ఫ్రీనెంబర్ కూడా ఇచ్చాడు. వందలు.. వేల మందిని దాటి.. కోట్లమంది మనసులను గెలుచుకున్నాడు. ఇదంతా కేవలం డబ్బువల్ల మాత్రమే కాదు.. చాలా మంది హీరోలు, క్రికెటర్లు, రాజకీయనేతలు.. అప్పనంగా కోట్లు కూడబెట్టారు. ఏ కొద్దిమందో సాయం విదిల్చారు. అసలు బయటకు వస్తే వైరస్ సోకుతుందనే భయంతో ఇంటి గడప దాటని వారెందరో వున్నారు. కానీ.. సోనూ.. మాత్రం.. తానే స్వయంగా రైళ్లు, బస్సుల వద్ద సొంత అన్నదమ్ములను ఊరు
పంపుతున్నంతగా సంబరబడిపోయాడు. మొన్న చిత్తూరు జిల్లాలో నాగేశ్వరరావు అనే రైతు.. సరదాగా కూతుళ్లతో నాగలి దున్నించటం చూడగానే ఏకంగా ట్రాక్టర్ కొని పంపాడు. శారద అనే ఇంజనీరింగ్ విద్యార్థిని.. ఐటీ కొలువు కోల్పోయి.. ధైర్యంగా
కూరగాయలు అమ్ముకుంటుంటే.. కదిలిపోయాడు. ఎంత గొప్ప మనసుంటే.. పక్కోడి కష్టం చూసి కరగాలి. ఎంతగొప్ప తల్లిదండ్రులకు బిడ్డగా పుడితే.. కోట్లాదిరూపాయలు కేవలం కాగితాలుగా భావించి ఖర్చుపెట్టాలి. కొందరు కారణజన్ములు ఇలాగే పుడుతుంటారు. అపుడెపుడో స్వాతంత్ర పోరాటంలో టంగుటూరి వీరేశలింగంపంతులు సంపదంతా పేదలకు ఖర్చుపెట్టారని చరిత్రలో చదువుకున్నా.. కానీ.. సోనూసూద్.. తన సంపాదన పేదింట ఆకలితీర్చేందుకు ఉపయోగిస్తుంటే.. ఏమనాలి. హీరో అనే పదం కూడా చాలా చిన్నదవుతుంది. అందుకే.. ఈ శతాబ్దపు హీరో అందాం. మనస్పూర్తిగా సోనూకు జై కొడదాం.. అదే స్పూర్తిని మనసులో నింపుకుని మనం కూడా సగటు మనిషిగా స్పందిద్దాం!!