అల్లు… న‌వ్వుల చిరు జ‌ల్లు!

ఏరా ఆ బొమ్మ‌లో అల్లోడు న‌వ్విస్తాడురా! అబ్బా త‌ల‌చుకుంటే ఇప్పుడు క‌డుపుబ్బి పోతుంద‌హే!  అటు.. ఇటూ కానీ పాత్ర‌లో పొట్ట చెక్క‌లు చేశాడు. ముత్యాలు. వ‌స్తావా.. అడిగిందీ ఇస్తావా! అంటూ చాకిరేవు కాడ నీ సోకంటూ.. అల్లు ఎన్ని హోయ‌లు పోయాడో. రాజా ఓ రాజా. ఓ బాల రాజా.. వ‌ల‌పంత పూరీ చేశా తిన‌వోయి రాజా అంటూ.. రొమాన్స్ పండించారు.  నాటిత‌రం వారిని ఎవ‌రి ముందు అల్లు రామ‌లింగ‌య్య అనే పేరు క‌దిపితే చాలు. ముఖంమీద చిరున‌వ్వు త‌రువాత కానీ.. ఆయ‌న సినిమాల గురించి చెప్ప‌రు. అంత‌గా మూడు నాలుగు త‌రాల‌ను త‌న హాస్యంతో న‌వ్వించి.. స‌హ‌న‌టుడుగా ఆప‌ద్బాంధ‌వుడు, స‌ప్త‌ప‌ది, శంక‌రాభ‌ర‌ణం వంటి సినిమాల్లో మెప్పించిన అస‌లు సిస‌లు న‌వ్వుల రేరేడు  అల్లు రామ‌లింగ‌య్య‌. జులై 31 ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా క‌ద‌లిక అల్లు రామ‌లింగ‌య్య‌కు ఘ‌న‌మైన నివాళి అర్పిస్తూ.. నాటి బ్లాక్ అండ్ వైట్ నుంచి 70 ఎంఎం సినిమా వ‌ర‌కూ 1030 వ‌ర‌కూ సినిమాల్లో న‌టించి రికార్డు సాధించారు. తూర్పుగోదావ‌రి జిల్లా పాల‌కొల్లు బిడ్డ అల్లు రామ‌లింగ‌య్య‌. 1922 అక్టోబ‌రు 1న జ‌న్మించారు. తండ్రి వెంక‌య్య‌. త‌ల్లి స‌త్తెమ్మ‌. ఏడుగురు సంతానంలో అల్లు రామ‌లింగ‌య్య నాలుగో సంతానం. పంచారామాల్లో ఒక‌టైన పాల‌కొల్లులోని క్షీర‌రామ‌లింగేశ్వ‌ర‌స్వామి పై భ‌క్తితో ఆ త‌ల్లి బిడ్డ‌కు రామ‌లింగ‌య్య‌గా నామ‌క‌ర‌ణం చేసింది. బిడ్డ బాగా చ‌దువుకోవాల‌ని ఆ త‌ల్లిదండ్రుల ఆశ‌. కానీ.. మ‌నోడికి చ‌దువు పెద్ద‌గా అబ్బ‌లేదు. ఎప్పుడూ స్నేహితులను వెంటేసుకుని నాట‌కాలంటూ తిరిగేవాడు. భ‌క్త‌ప్ర‌హ్లాద తాను వేసిన తొలి నాటిక‌. అది కూడా తానే ఎదురు డ‌బ్బులిచ్చి మ‌రీ పాత్ర పోషించి మెప్పించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్య‌మ స్పూర్తితో జాతీయోధ్య‌మంలో పాల్గొన్నారు. జైలుకెళ్లినా అక్క‌డా దేశ‌భ‌క్తి, హాస్యం రెండింటిని రంగ‌రించి అక్క‌డి వారిని న‌వ్వించేవారు. అలా.. అల్లు వారు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక మ‌ళ్లీ ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొంటు ఉండేవారు. అల్లు వారికేమో సినిమాలంటే మ‌మ‌కారం. అప్ప‌టికే నాగ‌రత్న‌మ్మ‌తో పెళ్ల‌యి న‌లుగురు సంతానం క‌లిగారు. 1952లో తొలిసారి పుట్టిల్లు సినిమా ద్వారా గ‌రిక‌పాటి రాజారావు సినీన‌టుడుగా ప‌రిచ‌మ‌య్యారు. కానీ ఆ సినిమా ప్లాప్ కావ‌టంతో కుటుంబ పోష‌ణ కు హోమియో వైద్యం ప్రారంభించారు. ఆ త‌రువాత వై.ఆర్‌.స్వామి ద‌ర్శ‌క‌త్వంలో వ‌ద్దంటేడ‌బ్బు సినిమాలో హాస్యం పండించి.. ఇక వెండితెర‌పై తిరుగులేని హాస్య‌న‌టుడుగా పునాది వేసుకున్నారు. 1972లో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ స్థాపించి ఎన్నో హిట్ సినిమాలు తీశారు. 1990లో ప‌ద్మ‌శ్రీ అవార్డు, 2001లో ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం ల‌భించింది. య‌మ‌గోల సినిమాలో ఆయ‌న పోషించిన చిత్ర‌గుప్తుడు పాత్ర ఇప్ప‌టికీ న‌వ్వులు పండిస్తుంది. అప్పం.. అప్పం. అమ్యామ్యా వంటివి ఆయ‌న మేన‌రిజమ్స్ నుంచి వ‌చ్చిన‌వే.  చిరంజీవి సినీ రంగంలో ఎదుగుతున్న స‌మ‌యంలోనే త‌న కూతురు సురేఖ‌ను ఇచ్చి వివాహం చేశారు. గీతాఆర్ట్స్ ద్వారా మెగాస్టార్‌తో విజేత‌, ప‌సివాడిప్రాణం వంటి ఎన్నో బంప‌ర్‌హిట్లు తీశారు. ఇటు.. కొణిదెల‌.. అటు అల్లు.. ఇరువైపులా కుటుంబాల్లోని మూడోత‌రంలో మ‌నుమ‌ళ్లు రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ హీరోలుగా ఎద‌గ‌టాన్ని చూసి ఎంతో ఆనంద‌ప‌డిపోయారట‌. 2004 జులై 31న అనారోగ్యంతో ఆయ‌న లోకాన్ని వీడారు. కానీ త‌ర‌త‌రాల నిల‌బ‌డే కీర్తిని సొంతం చేసుకున్నారు. ఆయ‌న జ్ఞాప‌కంగా 2013లో కేంద్ర ప్ర‌భుత్వం పోస్ట‌ల్ స్టాంపును విడుద‌ల చేసింది. కుటుంబం.. దేశం.. సినీరంగం.. వైద్యం ఇలా బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా భిన్న‌రంగాల్లో రాణించిన అల్లు రామ‌లింగ‌య్య‌.. నిత్య స్పూర్తిప్ర‌దాత‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here