ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనుకున్నది సాధించారు. తాంబూలాలిచ్చాం తన్నుకు చావమన్నట్టు ఆంధ్ర ప్రజల్ని వదిలేశారు. 2014లో నాటి కాంగ్రెస్ సర్కారు పుణ్యమాంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజదానిగా 10 ఏళ్లు వాడుకోవచ్చని తేల్చిచెప్పారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ ఎస్ అధికారం చేపట్టాయి. ఇద్దరి చంద్రుల మధ్య వైరం కాస్తం.. రాష్ట్ర విభజన తరువాత శాపంగా మారింది. ఉమ్మడి ఆస్తులు, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై ఇద్దరు సీఎంలకు పొంతన కుదరలేదు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్సీ కొనుగోలు వ్యవహారం కేసీఆర్ సర్కారు బట్టబయలు చేసింది. దీంతో చంద్రబాబు హైదరాబాద్ వదిలేసి
విజయవాడ కరకట్టపై కాపురం చేసేందుకు దారితీసింది. అలా ఏపీకు రాజధాని ఉండాలనే ఉద్దేశంతో పెద్దలందరూ చేరి కృష్ణానది పరివాహక ప్రాంతం. అమరేశ్వరుడు కొలువైన అమరావతిని 2014 అక్టోబరులో రాజధానిగా ప్రకటించారు. సుమారు 29 గ్రామాల రైతుల నుంచి 34 వేల ఎకరాల భూములు సేకరించారు. సచివాలయం, హైకోర్టు, పాలనభవనాలను రూ.10,000 కోట్లతో నిర్మించారు. అక్కడే చంద్రబాబు తప్పుచేశారు. ఓ వైపు పోలవరం, మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి ఉండగా.. జపాన్, చైనా, సింగపూర్, దుబాయ్ అంటూ ప్రపంచ నగరాలను పోలిన విధంగా అమరావతి నిర్మాణం జరగాలంటూ
ప్లాన్ కోసం తాత్సారం చేశారు. ఫలితంగా ఐదేళ్ల వ్యవధిలో పూర్తిస్థాయి రాజధాని నిర్మించలేకపోయారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తాను విపక్షంలో ఉన్నపుడు సమర్థించిన అమరావతి రాజధాని తరలింపు ఖాయమంటూ మాట మార్చేసింది. ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించేలా.. కర్నూలు, అమరావతి, విశాఖ మూడు రాజధానులను తెరమీదకు తెచ్చింది. 2020 జులై 30న ఎట్టకేలకు గవర్నర్ మూడు రాజధానుల బిల్లుపై సంతకం చేశారు. మరి ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ
మూడు రాజధానుల విషయాన్ని ఏం చేస్తుందనేది అసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తీసుకోబోయే నిర్ణయం వల్ల బీజేపీకు వచ్చే లాభనష్టాలేమీ ఉండవు. పైగా అమరావతి విషయంలో బీజేపీ కూడా అంటీఅంటనట్టుగానే ఉంటుంది. కేవలం ఒక సామాజికవర్గ ఓట్లు కోసం అమరావతికి జై కొడుతుందని ఏపీ ప్రజలు భావించట్లేదు. కానీ.. విశాఖలో జరుగుతున్న వరుస ప్రమాదాలు, అక్కడి ప్రశాంత వాతావరణాన్ని రాజధాని వల్ల కోల్పోతామనే భావన విశాఖ ప్రజల్లో ఉంది. కానీ.. జగన్ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని తేల్చాడు. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బీజేపీ సర్కారు ఎలా స్పందించబోతుంది. రాష్ట్రపతి అమోదముద్ర వేసేందుకు అంగీకరిస్తుందా: వద్దని వారిస్తుందా! అనేది సస్పెన్స్.