సముద్రమంతా నా కళ్లల్లో కన్నీటి అలలవుతుంటే.. అంటూ కళ్లతోనే హావభావాలు ఎంత గొప్పగా పలికించింది. మెగాస్టార్ చిరంజీవి పక్కన ఠాగూర్‌లో చమక్కున మెరిసింది. నాగ్‌తో మనంలో నత్తిపాత్రతో ఇంకెంత అందంగా ఒదిగిపోయిందో.. బాలయ్య ప్రతిష్ఠాత్మక చిత్ర.. గౌతమీపుత్రశాతకర్ణిలో వీరపత్నిగా ఎంత దర్పంగా ఉందనేది వేరే చెపనక్కర్లేదు. కుర్రహీరోల నుంచి స్టార్ ల వరకూ అందరితో నటించిన నటి.. శ్రియ.. అసలు పేరు శ్రియశరణ్. 1982 సెప్టెంబరు 11 న జన్మించారు. అసలు పేరు శ్రియ శరణ్ భట్నాగర్. పుట్టింది డెహ్రాడూన్‌లో అయినా హరిద్వార్ తో అనుబంధం ఉందంటారు. దిల్లీలోన లేడీ శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన శ్రియకు డ్యాన్స్ అంటే తెగ ఇష్టం. సంప్రదాయనృత్యాల్లో మాంచి ప్రావీణ్యం ఉంది.. తన నాట్యంతో తయారు చేసిన ఒక మ్యూజిక్ ఆల్బమ్‌తో సినీ రంగం దృష్టిలో పడింది. 2001లో ఇష్టం సినిమాతో వెండితెరకు పరియమైంది. 2002లో విడుదలైన సంతోషం సినిమాతో కమర్షియల్ హిట్ అందుకుంది. ఆ తరువాత తెలుగులో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్రహీరోలతోపాటు.. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, తరుణ్ వంటి వాళ్ల సరసన మెరిశారు. సీనియర్ హీరోల పక్కన సీనియర్ నటి ఎవరంటే.. నయనతార తరువాత శ్రియ పేరు వినిపిస్తుంది. 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్‌ను వివాహమాడారు. హిందీ, తెలుగు, తమిళం ఇలా.. పలుభాషా చిత్రాల్లోనూ నటిస్తూ.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ.. ఉండే శ్రియకు అప్పుడే 35 ఏళ్లా అనుకునేవారూ లేకపోలేదు. వయసు పెరిగినా.. వ్యాయామం, ఆహారనియమాలతో తాను మెరుపుతీగలా ఉండగలుగుతానంటోంది.. ఈ అందాలభామ.