అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం గురించి కథలు కథలుగా చెబుతుంటారు. ప్రపంచంలో అంతటి భద్రతాపరమైన అంశాలున్న విమానం మరే ఇతర దేశాల ప్రముఖులకూ లేదనే వాదన లేకపోలేదు. భారతదేశం నుంచి దేశ, విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రధాని, రాష్ట్రపతి తదితర ముఖ్యులకు ఎయిర్ ఇండియా బోయింగ్ మాత్రమే ఉపయోగించేవారు. మిగిలిన సమయాల్లో వాటినే ప్రయాణికుల కోసం వాడేవారు. దీంట్లో ప్రత్యేకత ఏముంది అనే విమర్శలూ ఉండేవి. కొత్తగా వచ్చిన బోయింగ్ 777 విమానం చేరికతో అమెరికా సరసన భారత్ చేరినట్టయింది. అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ దీన్ని రూపొందించింది. ఈ ఏడాది జులైలోనే భారత్‌కు అందాల్సిన ఈ విమానం కరోనా విస్తరించటంతో ఆలస్యమైంది. భారత్ స్వాతంత్రం పొందాక ఇటువంటి ప్రత్యేకమైన విమానాలను కేటాయించటం ఇదే తొలిసారి.
బోయింగ్ 777 విమానం.. దీన్నే ఎయిర్ ఇండియా వన్‌గా పిలుస్తున్నారు. ఇందులో అథునాతన వ్యవస్థల ఏర్పాటు, మీటింగ్ హాల్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, భద్రతా పరంగా శత్రువుల కన్నుగప్పే అన్నిరకాల వ్యవస్థలు ఇందులో పొందుపరిచారు. భారత వైమానికదళానికి చెందిన పైలెట్లు వీటిని నడుపుతారు. రూ.8458 కోట్ల వ్యవయంతో తయారు చేసిన విమానం గంటకు 559.33 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఏకబిగిన 17 గంటల పాటు నడవగల సత్తా దీనిసొంతం. ఇండియా నుంచి అమెరికా వెళ్లేందుకు ఎక్కడా ఆగాల్సిన అవసరం లేదన్నమాట. దీనికి అవసరమైన ఇందనం నింపేందుకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. ఆకాశమార్గంలోనే ఇండియా ఎయిర్‌వన్‌కు అవసరమైన ఇందనం నింపేందుకు వీలుంది.
శత్రువులు ఈ విమానంపై మిస్సైల్స్ ఉపయోగించినా అందకుండా సురక్షితంగా ప్రయాణించగల అధునాతన పరికరాలను అమర్చారు. కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్సివ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ స్వీట్ వల్ల శత్రువుల రాడార్లకు దొరకవు. వాటికి అందకుండా విమాన ఇంజన్ల నుంచి వచ్చే వేడితో శత్రుదేశాలు ప్రయోగించిన మిస్సైల్స్‌ను దారి మళ్లించగల సత్తా ఉంది. సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్(ఎస్‌పీఎస్) దీని ప్రత్యేకత. ఇలా ఎన్నో రక్షణ వ్యవస్థలతోపాటు.. భారత్ ప్రముఖులు విదేశీ పర్యటనలకు ఇది మరింతగా ఉపకరిస్తుందనేది వాయుసేన అభిప్రాయం.