లాబీయింగ్.. పైరవీలు.. ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఏదైనా చేయగల సమర్థత ఆంధ్ర రాజకీయ నేతల సొంతం. అవకాశం వచ్చాక అమెరికా రాజకీయాలను ప్రభావితం చేయగలిగేంతగా చక్రం తిప్పుతున్నారు. గతంలో బిల్‌క్లింటన్ గెలుపులో కీలకమైన పాత్ర కూడా ప్రవాస ఆంధ్రులదే. మొన్న ట్రంప్ గెలుపులోనూ తెలుగోడి ఓటు బాగానే పనిచేసిందట. ఇండియన్స్ అంటేనే పొలిటీషియన్ అదెలా అంటారా.. పల్లె నుంచి పట్టణం వరకూ ప్రతి ఒక్కరిలోనూ కుల, మత, ప్రాంతాలను బట్టి రాజకీయ పార్టీ/ నాయకుడు అభిమానులై ఉంటారు. దేశం మారినా నరనరాన ఉన్న పొలిటికల్ ఇంట్రస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. అయినా అమెరికాకు… ఆంధ్రాకు సంబంధం ఏమిటనేగా మీ అనుమానం.
డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా వచ్చింది. సతీసమేతంగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు ప్రకటించారు. ఆ తరువాత కాస్త నీరసం ఎక్కువగా ఉండటంతో శుక్రవారం రాత్రి ఆయన్ను అమెరికా ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి పాలన చక్కబెడుతున్నారు. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం వయసు 74 . అకస్మాత్తుగా కరోనా భారీనపడ్డారు. సెల్ఫీవీడియోలో హోం క్వారంటైన్‌లో చికిత్స అని చెప్పారు. కానీ తరువాత ఆసుపత్రిలో దాదాపు 50 రోజుల పాటు ఎక్మా చికిత్సపై వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వయసు కూడా 74 . ఈ వయసులో కొవిడ్ కు గురై బతికి బట్టకట్టిన వారు చాలా తక్కువ . 65 ఏళ్ల పై బడిన వారిలో కరోనా పాలిట పడిన బాధితులు 80శాతం మంది మరణించినట్టు అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ వయసులో ఆరోగ్యంగానే ఉన్న ట్రంప్ కరోనాపై విజయం సాధించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే ధీమా వ్యక్తమవుతోంది.
ట్రంప్ కొవిడ్19 పాజిటివ్ అని తెలియగానే ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైంది. అగ్రరాజ్య అధినేత కూడా వైరస్‌నుంచి తప్పించుకోలేకపోయాడనే వార్త దావానంలా వ్యాపించింది. ఇక్కడే ట్రంప్ మార్కులు కొట్టేశాడు. ఇటీవల జరిగిన సర్వేలో కేవలం 44 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నారు. ప్రత్యర్ధి బైడెన్ పట్ల అమెరికా ఓటర్లు 55శాతం మొగ్గుచూపుతున్నారు.
ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో ట్రంప్ వైరస్ భారీనపడటం తమకు కలసివస్తుందని డెమొక్రెట్లు అంచనా వేసుకుంటున్నారు. వాస్తవానికి ట్రంప్ కొవిడ్19 నుంచి బయటపడితే ఒక లెక్క.. సీరియస్‌గా మారితే మరో లెక్క. ఇప్పటికే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఎదుర్కొంటున్న వ్యతిరేకత సానుభూతిగా మారిందట. పాపం ట్రంప్ ప్రజల కోసం తిరిగి వైరస్ పాలిట పడ్డారనే ప్రచారం ఊపందుకుందట. మొదట్నుంచి చైనాను వ్యతిరేకిస్తున్న ట్రంప్ కరోనాతో మరింత స్వరం పెంచారు. ఇప్పుడు ఆయన కోపంలో నిజం ఉందనే అంశాన్ని అమెరికన్లు అంగీకరిస్తున్నారట. ఇటు సానుభూతి.. అటు అప్పనంగా వచ్చే ప్రచారంతో ట్రంప్ ఓటమి నుంచి తేలికగా గట్టెక్కుతారంటున్నారు విశ్లేషకులు.
ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సానుభూతి పవనాలు రాజకీయ అస్త్రంగా బాగా ఉపయోగపడతాయి. డిపాజిట్లు కూడా సాధించలేని అభ్యర్థులకు అమాంతం రికార్డు స్థాయి మెజార్టీను
కట్టబెట్టిన సందర్భాలున్నాయి. పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లతో పోలీసు లాఠీ దెబ్బలు రుచిచూసిన నిందితులు కూడా చట్టసభల్లోకి రాగలిగారంటే కారణం.. సానుభూతి అస్త్రమే. అటువంటిది అమెరికాలో ట్రంప్ పై పెల్లుబుకే సానుభూతి రెండోసారి అధ్యక్షుడిని చేయలేకపోతుందంటారా!!!!