గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడును ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. అన్నా…మంచిపేరు తెచ్చుకుంటున్నావ్…దూసుకుపో… కీపిటప్.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేయర్ ను అభినందించారు. బుధవారం ప్రకాశం బ్యారేజి వద్ద అమరావతి కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని గుంటూరు నగర మేయర్ మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ‘కావటి’ని ముఖ్యమంత్రి ఆత్మీయంగా పలకరిస్తూ ఇటీవల కరోనా మృతుల అంత్యక్రియల ఖర్చులకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ నిర్ణయాన్ని ప్రశంసించారు. కోవిడ్ ఆపత్కాల సమయంలో ఉచిత అంత్యక్రియల నిర్ణయంతో మేయర్ గా మానవత్వం చాటుకున్నారన్నారు. అదేవిధంగా నగరంలో డివిజన్ కార్పొరేటర్లందరితో టెలీకాన్ఫెరెన్స్ లు నిర్వహించి డివిజన్లలో కోవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ల ప్రక్రియ చురుగ్గా సాగడాన్ని మేయర్ కావటి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తెచ్చారు. గుంటూరు నగరంలో తాజాగా ఏర్పాటవుతున్న ఫుడ్ బ్యాంక్ ల నిర్ణయాన్ని సైతం ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. ఈ మర్యాదపూర్వక భేటిలో మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరి, ఇతర జిల్లానేతలు ఉన్నారు.



