మంగళగిరి:
యువనాయకత్వమే వైఎస్ఆర్ సీపీ బలమని…యూత్ ఐకాన్ గా భీమనాదం భరత్ రెడ్డి నిలిచారని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
సిమ్స్ విద్యాసంస్థల అధినేత, వైఎస్ఆర్ సీపీ నేత భీమనాదం భరత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు ముఖ్య అతిథిగా హాజరవగా, పలు నియోజకవర్గాల వైసీసీ ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తాఫా, కిలారి రోశయ్య, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, అరకు ఎంపీ భర్త, రాష్ట్ర వైసీపీ నేత శివప్రసాద్, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిల, రాష్ర్ట వైసీపీ నేతలు మందపాటి శేషగిరిరావు, జియావుద్దీన్, షేక్ షౌకత్ తదితరులు విచ్చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగానున్న విల్లాల ఆవరణలో భరత్ రెడ్డి అభిమానులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. గుంటూరు, విజయవాడ హైవే రహదారి నుంచి విల్లాల ఆవరణ వరకు భరత్ రెడ్డి జన్మదిన వేడుకల ఫ్లెక్సీలు కళకళలాడుతూ నిండుగా కనిపించాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్ల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు భరత్ రెడ్డి పుట్టిన వేడుకలకు బైక్ ర్యాలీలతో తరలివచ్చారు.
రక్తదాన శిబిరం:
సిమ్స్ విద్యాసంస్థల అధినేత భీమనాదం భరత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా
సిమ్స్ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో విల్లాల ఆవరణలోనే రక్తదాన శిబిరం నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ చేతులమీదుగా రిబ్బన్ కత్తిరించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా… 50మందికి పైగా విద్యార్థులు రక్తదానమిచ్చి భరత్ రెడ్డిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పేద కళాకారులకు ఆర్ధికసాయం:
కరోనా లక్డౌడ్ కారణంగా ప్రదర్శనలు నిలిచిపోవడంతో ఆర్ధికంగా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న రంగస్థల పేదకళాకారులను గుర్తించి భీమనాదం భరత్ రెడ్డి ఆర్థికసాయమందించారు. గుంటూరు, విజయవాడకు చెందిన పదిమంది రంగస్థల కళాకారులను రప్పించి.. ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున మంత్రి, ఎమ్మెల్యేల చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సాయమందుకున్న సీనియర్ రంగస్థల కళాకారిణి విజయలక్ష్మి మాట్లాడుతూ .. జన్మదిన సందర్భంగా పేద కళాకారులను ఆదుకోవాలనే ఆలోచన రావడమే గొప్ప విషయమన్నారు. కళామతల్లి ఆశీస్సులతో భరత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. పలు సామాజిక సేవాకార్యక్రమాల నడుమ భరత్ రెడ్డి జన్మదిన వేడుకలు కొత్తతరహా వాతావరణానికి నాందిపలికాయంటూ అక్కడికి విచ్చేసిన నాయకులందరూ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా భరత్ రెడ్డి స్పందిస్తూ.. తన తుదిశ్వాస వరకు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవిధంగా అండగా ఉంటానన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులతో వైఎస్ఆర్ సీపీలో యువనాయకత్వం బలపడేందుకు తాను అహరహం కష్టపడతానని హామీనిచ్చారు. పుట్టిన రోజు వేడుకలకు గుంటూరు నగరం నుంచే కాకుండా రూరల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా భరత్ రెడ్డి అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి అభిమానాన్ని చాటుకోవడం విశేషం.