దుబ్బాక ఎన్నికల ఫలితం రాజకీయంగా బాగానే ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ ఎంతో ధీమాగా వేగంగా దూసుకెళ్లిన కారుకు బ్రేకులు పడినట్టయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను తేలికగా తీసుకున్న టీఆర్ ఎస్ ఈ దఫా 100 కు పైగా సీట్లు సాధించగలమని ధీమాగా చెప్పింది. కానీ.. దుబ్బాక దెబ్బకు.. వాస్తవంలోకి వచ్చిపడినట్టయింది. అంతే తమ లెక్కలన్నీ తారుమారు కావటంతో.. వరదసాయం, అభివృద్ధి కార్యక్రమాలతో జనంలోకి వెళ్లబోతుంది. కేసీఆర్ కూడా పలు సభల్లో ప్రసంగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటి వరకూ ప్రధాన ప్రత్యర్థులు ఎవరనే అనుమానాలుండేవి.. ఇప్పుడు బీజేపీ, టీఆర్ ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందనేది బట్టబయలైంది. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్నిచోట్ల ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అయితే. నేతల మధ్య అంతర్గత వైరంతో హస్తం కూడా సీట్లు నెగ్గటం అంత ఈజీ కాదనే అంచనాలే వేసుకుంటుంది. జనసేన కూడా రంగంలోకి దిగుతామంటున్న పరిస్థితి. ఏపీలో బీజేపీ, జనసేన పొత్తును తెలంగాణలోనూ కొనసాగించాలనేది పవన్ అంతరంగం. అందుకే మొన్న దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావుకు మద్దతు తెలిపారు. దీని ఫలితంగానే దుబ్బాకలోని మున్నూరు కాపు వర్గానికి చెందిన ఓటర్లు రఘునందన్‌రావుకు ఓటేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఇదే కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. బీజేపీ తరపున బరిలోకి దిగేందుకు సుమారు 50 డివిజన్లలో బలమైన పోటీ ఉందట. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఎన్నికల జరిగేందుకు చాలా కొద్ది సమయమే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే తాము వ్యూహాత్మకంగా ఓటర్ల ను కలవాలనేది కమలం పార్టీ శ్రేణులు ముందుచూపు. ఇప్పటికే పలు డివిజన్లలో పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ అభ్యర్థులు జనం వద్దకు వెళ్తూనే ఉన్నారట.