రేఖ.. బాలీవుడ్‌లో తిరుగులేని నటి. ఆరుపదులు వయసు దాటిని చెక్కుచెదరని అందం ఆమె సొంతం. వందలాది సినిమాల్లో నటించిన ఆమె అచ్చమైన తెలుగింటి అమ్మాయి. ఇప్పటికీ అద్భుతంగా తెలుగు మాట్లాడగలరు. మహానటి సావిత్రికి పిన్ని వరుస కూడా అవుతుంది. అదెలా అంటారా.. రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు నటి.. తండ్రి జెమినీ గణేషన్. ఈ దంపతుల మొదటి కూతురు రేఖ. జెమినీ గణేశన్‌కు సావిత్రి రెండోభార్య. ఇలా.. రేఖకు సావిత్రి పినతల్లి వరుస అయ్యారన్నమాట. రేఖ బాలనటిగా తొలిసినిమా కూడా సావిత్రి సరసనే నటించారు. ఎన్‌టీఆర్-సావిత్రి జంటగా నటించిన ఇంటిగుట్టు సినిమాలో రేఖ తొలిసారి సినీనటిగా ఓనమాలు నేర్చుకున్నారు. 1954 అక్టోబరు 10న పుట్టిన ఆమె జన్మదినం ఈ రోజు. బిగ్‌బీ అమితాబ్-రేఖ జంటగా సినిమా వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద అభిమానులకు పూనకం వచ్చేది. ఒకానొక సమయంలో ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ.. 1990లో రేఖ.. అగర్వాల్ అనే వ్యాపారిని పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అప్పటి ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. 180కు పైగా బాలీవుడ్ సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. కామసూత్ర, ఆస్త, లజ్జ వంటి సామాజిక అంశాలపై ఆమె నటించిన సినిమాలు సంచలనాలకు వేదికగా మారాయనే చెప్పాలి. అయినా కొత్త ప్రయోగాలు.. నటిగా తనదైనశైలితో ఇప్పటికీ ఆకట్టుకుంటున్నారు. పదుల సంఖ్యలో పురస్కారాలు.. అవార్డులు ఆమెను వరించాయి. ఇప్పటికీ తెలుగు సినిమాలను చూస్తానంటారామె. హైదరాబాద్ వచ్చినపుడు ఎంచక్కా తెలుగులోనే ముచ్చటిస్తుంటారు. 13 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైన రేఖ.. ఇప్పటికీ చెరగని అందంతో మెప్పిస్తున్నారు.