బ్రహ్మ కమలం తెలుసు.. మరీ బ్రహ్మ వజ్ర కమలం ఏమిటంటారా! ఒకటి సహజంగా పూసే పువ్వు. మరొకటి గిన్నిస్ పుస్తకంలో ఖ్యాతి సాధించిన అద్భుతం. నిజమే.. హైదరాబాద్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కొట్టి శ్రీకాంత్ అద్భుత సృజనకు నిలువుటద్దం. ఒకే ఉంగరాన్ని 7801 వజ్రాలతో పొదగటమే దీని ప్రత్యేకత. భారతీయత అంటేనే సంప్రదాయాల పునాది. అటువంటి చోట బ్రహ్మకమలం అంటే ఎంతటి భక్తిభావం ఉంటుందో అందరికీ తెలిసిందే.. అందుకే.. బ్రహ్మకమలం పోలినట్టుగా వజ్రపు ఉంగరాన్ని బ్రహ్మ వజ్ర కమలానికి రూపమిచ్చారు. దాదాపు 45 రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి.. హల్‌మార్క్ గత 7801 వజ్రాలను దీనిలో పొందుపరిచారు. ఒక్కో లేయర్‌లో 8 రేకులు ఉండేలా. ఆరు లేయర్లను రూపొందించారు. ఇలా రూపుదిద్దుకున్న బ్రహ్మ వజ్ర కమలం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తొలిసారి చోటుదక్కించుకుంది. గిన్నిస్ పుస్తక నిర్వాహకులు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా ప్రదర్శనకు ఉంచారు.