నాగార్జున పర్స్‌లో ఎప్పుడూ ఆయన ఫొటో ఉంటుంది.. మెగాస్టార్ చిరంజవికి ఎప్పుడు మనసు గజిబిజిగా ఉన్నా ఆయనకు కబురు వెళుతుంది. మోహన్‌బాబు వంటి నటుడిపై సెటైర్లు వేయగల గొప్పనటుడు. అంతమాత్రాన ఆయన సీరియస్‌గా ఉంటాడనుకునేరు. మార్గదర్శి కాదు. ఫిలాసపర్ అంతకు మించి కానేకాదు. అయినా తన పేరు వినగానే ముఖంపై నవ్వు మొలకెత్తుతుంది. అప్పటి వరకూ ఒత్తిడికి గురైన మనసు తేలికపడుతుంది.. అందుకే ఆయన్ను ఆనందరూపమంటారు.. ఆ నాడు.. రమణారెడ్డి, రేలంగి, పద్మనాభం , రాజబాబు వంటి గొప్ప హాస్యనటుల సరసన నిలబడేలా చేసింది.. పేరులోనే బ్రహ్మానందం కాదు.. హాస్యాన్ని పంచుతూ.. ప్రజలకు బ్రహ్మానందం పంచే స్వరూపుడు అనేంతగా ఎదిగారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద చాగంటివారిపాలెంలో 1956 ఫిబ్రవరి 1న పుట్టిన బ్రహ్మానందం.. తెలుగు అధ్యాపకుడుగా పనిచేశారు. తండ్రి నుంచి వారసత్వంగా అందుకున్న నటనతో వెండితెర నవ్వుల రారాజుగా ఎదిగారు. వీడెవడండీ బాబు ఇంతగా నవ్విస్తున్నాడు.
ఓర్నీ ఎంకమ్మా అంటూ చిత్రం భళారే చిత్రంలో పేల్చిన పంచ్ ఇప్పటికీ సగటు తెలుగు వాడికి ఊతపదంగా మారింది. ఖాన్‌తో గేమ్స్ వద్దంటే.. అదీ నోటిలోనే నిలిచిపోయింది. నెల్లూరు పెద్దారెడ్డి అల్లుడుగా … రావు గారూ నన్ను ఇన్‌వాల్వ్ చేయవద్దు ప్లీజ్. జాక్సన్.. మైకెల్ జాక్సన్. జిలేబి.. ఇలా ఏ పాత్ర పోషించినా నవ్వుల మతాబు వెలుగులు జిమ్ముతాయి. కష్టాలతో సహవాసం చేస్తూ కూడా దాన్ని మనసులో దాచుకుని నవ్వులు పంచటమే తనకు దైవం ఇచ్చిన వరంగా భావిస్తుంటారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.. గొప్ప చిత్రకారుడు. అంతకు మించిన కవి.. ఆల్‌రౌండర్ కూడా ఇటీవల రోజుల తరబడి శ్రమించి రూపమిచ్చిన కలియుగదైవం వేంకటేశ్వరుని రూపం ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉంది. కొద్దికాలం క్రితమే బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. వారసులను తెలుగు తెరకు పరిచయం చేసినా ఎందుకో..బ్రహ్మానందానికి కాలం పరీక్ష పెట్టింది. అయినా కళామతల్లికి సేవ చేస్తూనే ఉన్నారు.. ఇంతగా తాను ఎదిగేందుకు.. పునాది వేసింది.. వెన్నుతట్టి ప్రోత్సహించింది మాత్రం మెగాస్టార్ చిరంజీవేనంటారు బ్రహ్మానందం. నవ్వుల రేరేడు.. బ్రహ్మానందుడి పుట్టిన రోజుశుభాకాంక్షలతో పాటు. మరో వందేళ్లు.. తెలుగు ప్రేక్షకులకు ఇలాగే నవ్వులు పంచాలని కదలిక టీమ్ అభినందనలు తెలుపుతోంది.