హీరోయిన్ అంటే పాత సినిమాలో మాదిరిగా.. నిండా చీరకట్టుకుని.. కన్నీరు కార్చుతూ.. శోకానికి అమ్మగా ఉండాలనుకునే హీరోయన్లం కాదు.. తేడాలోస్తే.. తాడోపేడో తేల్చుకుంటాం. ఫట్‌ఫట్‌లాడిస్తూ నోరుతెరిస్తే చుక్కలు చూపించే హీరోయిన్లం అంటున్నారీ నవతరం భామలు. నిజమే సుమీ.. కాలం మారింది కాబట్టి.. ఇంకా మనం పాతకాలం నాటి కట్టుబొట్టు.. హీరోగారు రాగానే లేచి నిలబడి.. ఒక నమస్కారం.. దర్శకుడు సెట్‌లో ఉంటే..వణకిపోయే కాలం కాదు. బాలీవుడ్ నటి కంగనారనౌత్.. అప్పట్లో తెలుగు దర్శకుడు క్రిష్‌పై చేసిన కామెంట్స్ సంచలనం రేకెత్తించాయి. పద్మావతి సినిమాకు తానే దర్శకురాలినంటూ చెప్పేశారు. ఇప్పుడు సుశాంత్‌సింగ్ మరణం వెనుక దాగిన నిజాలను వెలికితీసేంత వరకూ ఊరుకోనంటోంది. ఏకంగా ముంబైను పీఓకేతో పోల్చి మరీ చెండాడింది. ముంబై ఎలా వస్తావో… చూస్తామంటూ శివసేన నేతల సవాల్‌కు ప్రతిగా.. 9వ తేదీ ముంబై వస్తా కాచుకోమంటూ ప్రతిసవాల్ చేసిన వీరనారి. తెలుగు తార.. మాధవీలత కూడా.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ డ్రగ్స్ కంపు ఉందంటూ సంచలనం రేకెత్తించింది. అయితే రుజువులు తీసుకురామంటూ.. పోలీసు అధికారులు కౌంటర్ ఇచ్చారు. తాను కూడా అదే వెండితెరపై ఉన్నాను కాబట్టి తెలుసంటోంది.. కావాలంటే.. పోలీసులే దర్యాప్తు చేపట్టాలంటోంది. ఇప్పుడు మరో భామ.. అదేనండీ జూనియర్ ఎన్టీఆర్‌తో అశోక్ సినిమాలో మెరిసిన లావు సుందరి సమీరారెడ్డి తాను కూడా.. క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనంటూ చెప్పేసింది. సినిమా అంటేనే వైకుంఠపాళి.. అక్కడ పాముల నోటికి చిక్కకుండా తప్పించుకోవటమే సవాల్ అంటూ వేదాంత ధోరణిలో వాస్తవాలు కక్కేసిందన్నమాట. కేరక్టర్ ఆర్టిస్ట్ తేజస్విని కూడా ఇంతకీ.. ఏమిటీ సంగతంటూ తనకూ ఓ అనుభవం ఉందంటూ చెప్పకొచ్చారు. ఇవన్నీ ఇంతకాలం భరిస్తూ వచ్చాం.. ఎవరో ఒకరు ముందుకు వస్తే తమ గొంతు వినిపిద్దామనుకున్నారు .. ఇన్నాళ్లకు ఫైర్‌బ్రాండ్‌లు బయటకు రావటంతో.. హీరోయిన్లు కూడా గళాన్ని విప్పుతున్నారు.