బలమైన నాయకత్వం.. అంతకుమించిన విశ్వాసంగా పనిచేసే కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం. క్రమశిక్షణకు నిదర్శనం. 2019 ఘోర వైఫల్యం వెనుక బాబు వెన్నంటి ఉంటూ తప్పుడు సలహాలు ఇచ్చిన పెద్దలు. పార్టీలోని కొందరు మంత్రులపై ఉన్న ఎమ్మెల్యేల వ్యతిరేకత కూడా కలసివచ్చింది. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, శ్రీకాకుళం వంటి జిల్లాలు తెలుగుదేశం పార్టీకు కంచుకోటలు. అటువంటి జిల్లాల్లో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నామ్‌కేవాస్తుగా మారారు. మండలానికో ఇద్దరు ముగ్గురు నేతలు తామే ఎమ్మెల్యేలుగా పెత్తనం చేశారు. గతానికి భిన్నంగా అవినీతితో అంటకాగారు. పార్టీ ఓటమిలో ఇటువంటి షాడోల పెత్తనమే ఎక్కువగా ఉందంటూ చంద్రబాబుకు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కానీ చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న నమ్మకం తేలికగా గెలిపిస్తుందనే కొందరి సర్వే నివేదికలు కూడా అధినేత చంద్రబాబుకు అడ్డంకిగా మారాయి. కొన్ని నియోజకవర్గాల్లో కుల పరమైన వ్యతిరేకత కూడా టీడీపీను దెబ్బతీసిందంటూ జాతీయస్థాయి సర్వే సంస్థలు కూడా చెబుతున్నాయి.
రాజకీయాల్లో అపర చాణక్యుడుగా తనకంటూ గుర్తింపు ఉన్న చంద్రబాబునాయుడు విపక్షంలో ఉన్నపుడు వేగంగా పావులు కదుపుతుంటారు. శ్రేణులను ఉత్సాహపరుస్తూ.. ప్రజల్లో మమేక మయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సారి కాస్త వెనుకబడినట్టు కనిపించినా కొత్త నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించటంతో మరోసారి టీడీపీ జనాల్లోకి వెళ్తుందనే భావన పార్టీ వర్గాల్లోనూ బలపడుతుంది. జగన్ సర్కార్ పాలనలో విఫలమైందంటూ టీడీపీ, బీజేపీ ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీలో టీడీపీ బలమైన కేడర్ ఉన్న పార్టీ. కొత్త వారికి పార్లమెంటరీ నియోజవర్గ బాధ్యతలు అప్పగించటంలోనూ చంద్రబాబు ఆచితూచి స్పందించారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా వెన్నంటి నిలిచేవారికే పట్టం కట్టారు. కులపరమైన ఇబ్బందులకు కారణమవుతున్న నాయకులు ఎంత బలంగా ఉన్నా పక్కనబెట్టారు. అందర్నీ కలుపుకుని పోగలిగే వారికి మాత్రమే బాధ్యతలు ఇచ్చారు.
తాజాగా 2014-19 వరకూ ఎమ్మెల్యేల తరపున పెత్తనం చేసి పార్టీ పరువు తీసిన షాడో నేతల గురించి కూడా చంద్రబాబు సమాచారం సేకరిస్తున్నారు. ఈ విషయంలో లోకేష్‌బాబు పూర్తి బాధ్యతలు చేపట్టినట్టు సమాచారం. అధికారంలో ఉన్నపుడు కాంట్రాక్టులు, పదవులు దక్కించుకుని ఏడాదిన్నరగా పార్టీ కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉన్న నాయకుల పట్ల కఠినంగా ఉండేందుకు టీడీపీ క్రమశిక్షణ కమిటీ కొన్ని సిఫార్సులు కూడా చేసినట్టు తెలుస్తోంది. అందర్నీ కలుపుకుని వెళ్లాలనే అధినేత ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నేతలు సిద్ధమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ నిరసనలు తెలిపేందుకు రాబోయే రోజుల్లో మరింతగా ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్టీ తమకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వలేదని అలకబూనిన నేతలు ఎంత వరకూ కలసివస్తారనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది.