నారా చంద్రబాబునాయుడు.. ఏపీ రాజకీయాల్లో ఆయనొక సంచలనం . విజన్ ఉన్న నాయకుడుగా ప్రత్యేక గుర్తింపు. వ్యూహ ప్రతి వ్యూహాల్లోనూ సమర్దుడు. రాజకీయం అంటేనే.. రాజకీయాలు చేయాలి. గెలుపే ధ్వేయంగా పావులు కదపాలి. ప్రతి ఒక్క పార్టీ అదే చేస్తుంది. కాదు.. మేం ప్రత్యేక మార్గంలో వెళ్లాలనుకుంటే అక్కడే ఆగిపోతారనేది కూడా కొన్ని ప్రాంతీయపార్టీలను గమనించినపుడు అర్ధమవుతుంది. అందుకే.. టీడీపీ అధినేతగా చంద్రబాబు ఎప్పుడూ అధికారం సాధించేందుకు చక్రం తిప్పుతుంటారు. కొన్నిసార్లు ఫెయిలైనా.. చాలాసార్లు విజయం అందు కున్నారు. 2014లోనూ దాదాపు ఇక బాబు వ్యూహాలకు పదను తగ్గిందంటూ వెక్కిరించారు. ఆ సమయంలోనే టీడీపీ నేతలు.. అభిమానులు.. అనుకూల వర్గాలు ఏకతాటిపైకి వచ్చి బాబును సీఎం చేసేందుకు ఉడతసాయం చేశారు. 2019లో బీజేపీతో తెగతెంపులు చేసుకోవటం ద్వారా టీడీపీను జనం ఆదరిస్తారనే తప్పటడుగులు బాబును బాగా దెబ్బతీశాయి. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్‌ను దెబ్బతీసేందుకు, బీజేపీను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో చేతులుకలిపారు. అది చారిత్రక అవసరం అంటూ.. అనుకూల మీడియా గొంతుచించుకున్నా.. జనం మాత్రం అది చారిత్రక తప్పిదంగానే ముద్రవేశారు. పైగా బాలయ్య, లోకేష్‌బాబు వంటి వారి రాజకీయ పరిణితి జనాలకు అర్ధమైంది. తెలంగాణలో కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ను తలదన్నేలా తన తనయుడు లోకేష్ బాబును మార్చాలనే ఆశలు కూడా అత్యాశగానే మిగిలాయి.
గతానికి భిన్నంగా 2014లో బాబు చుట్టూ చేరిన సొంత కులం.. మిగిలిన కులాలను దూరం చేశాయనే వాదన లేకపోలేదు. చంద్రబాబు తన వాడు అనుకున్న కమ్మ వర్గం కూడా.. బాబు తన మంత్రివర్గంలో నారాయణ, చినరాజప్ప వంటి కాపు వర్గానికి మంత్రిపదవులు ఇవ్వటం.. పార్టీలో కీలకంగా మార్చటాన్ని జీర్ణించుకోలేకపోయారు. గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్వయంగా కమ్మవర్గానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ కమ్మసంఘంలో జరిగిన సమావేశంలో బహిరంగంగానే కామెంట్ చేశారు. నిఘా విభాగ అధికారిగా ఏబీ వెంకటేశ్వరరావు అన్నీతానై పోలీసు వ్యవస్థను నడిపించారు. నండూరు సాంబశివరావు డీజీపీగా ఉన్నా కేవలం కాపు కులం కావటంతో పేరుకు మాత్రమే డీజీపీ అనే ముద్రకూడా పడేందుకు బాబు కారణమయ్యారు. ఇవన్నీ బాబు తెలిసి చేసినా తెలియకుండా జరిగినా.. పార్టీ అధినేతగా.. సీఎంగా చంద్రబాబు ఓటమికి తానే కారకుడయ్యారనేది విశ్లేషకుల అంచనా
అది గతం.. మరి ఇప్పుడేం చేయాలి.. తమిళనాడు, బిహార్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. కానీ ఎక్కడా ప్రాంతీయపార్టీలు చంద్రబాబు పేరు తలవట్లేదు. 2018 ఎన్నికలపుడు ప్రాంతీయపార్టీలను కలుపుకుని వెళ్లాలనే చంద్రబాబు కోరిక అలాగే మిగిలింది. అధికారంలో ఉన్నపుడు దేశంలోని ప్రాంతీయపార్టీలు బాబు వైపు చూసేవి. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించట్లేదు. ఏపీలోనూ టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు క్యూ కడుతున్నారు. సొంతపార్టీ నేతలను కాపాడుకోలేని నేతగా చంద్రబాబు మిగిలారనే విమర్శలు చవిచూడాల్సి వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో రఫేల్ యుద్ధవిమానాల వెనుక అవినీతి అంటూ మోదీను విమర్శించిన బాబు.. తాజాగా రఫేల్ యుద్ధవిమానాల గురించి ప్రశంసిస్తూ ట్వీట్ చేయటాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి యూటర్న్ నేతగా చంద్రబాబును వర్ణిస్తూ ఘాటుగా విమర్శించారు. టీడీపీ బీజేపీతో కలిసేందుకు ఏ ఒక్కనేత సముఖంగా లేరంటూ గుర్తుచేశారు. అటు కాంగ్రెస్ కూడా చంద్రబాబును పరిగణలోకి తీసుకోవట్లేదు. జాతీయస్థాయిలో ఒకప్పుడు ప్రాంతీయపార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన ఎన్టీఆర్ అధికారానికి దూరమయ్యాక ఒంటరిగా మారారు. ఇప్పుడు అదే దారిలో చంద్రబాబును కూడా.. ఒంటర్ని చేశారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.