భూటాన్..నేపాల్.. పాకిస్తాన్ దారికి వచ్చినట్టు.. భారత్ కూడా తాటాకు చప్పుళ్లకు భయపడుతుందని భావించిన చైనాకు ప్రతిసారీ భంగపాటు తప్పట్లేదు. పాక్ ఉందని రెచ్చిపోదామని భావించినా.. తమ సైనికుల శౌర్యం ఏపాటిదో తెలిసి తోకముడిచే పనిలో పడినట్టుంది. వాస్తవానికి ప్రపంచంలోనే నెంబర్‌వన్ స్థానంలో చైనా సైనిక సంపత్తి ఉంది. భారత్ నాలుగో ప్లేస్‌లో ఉన్నా.. వాయు, జల మార్గాల్లో మాత్రం చైనాను ఎదుర్కొనేందుకు భారత్ ఇతర దేశాల మీద ఆధారపడాల్సిందే. కానీ.. అంతకు మించిన భారత సైనికుల పరాక్రమాలు.. యుద్ధంలో దిగితే చావో రేవో అనేంతగా తెగబడే దేశభక్తి చైనాను కలవరపాటుకు గురిచేస్తున్నాయట. అందాకా ఎందుకు.. చైనా ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఫాంగాంగ్ సరస్సు, ఫింగర్ 4 వద్ద భారత సైనికులు పాగా వేశారు. తాను బలంగా ఉన్నానని నమ్మిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకు భారత సత్తా అప్పటికి కానీ తెలియలేదు. కానీ అప్పటికే ఆలస్యమైంది. అందుకే భారత్ ను బెదిరించేందుకు చైనా మరో అడుగు ముందుకేసింది. మాక్‌డ్రిల్ ద్వారా తమ సైనిక శక్తిని చూపింది. అప్పటికీ భారత్ దారికి రావట్లేదనే ఉద్దేశంతో లక్షలాది మంది సైనికులను బోర్డర్‌కు తరలిస్తుంది.
అయితే ఇక్కడే అనుకోని అవమానం చవిచూసింది చైనా. భారత సరిహద్దులకు చేరుతున్న చైనా సైనికులు ఏడుపులు.. పెడబొబ్బల వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇండియన్ ఆర్మీ ధైర్యసాహసాలు తెలిసిన చీనీ ఆర్మీ భయంతో ఇలా ఏడుస్తుందంటూ.. తైవాన్ దేశ మీడియా ప్రచారం చేసింది. దీన్ని చైనా ఖండించింది. తమ దేశ సైనికులు యుద్ధ సన్నద్ధతలో భాగంగా దేశభక్తి పాటలు వింటూ బావోద్వేగానికి లోనయ్యారంటూ కవరింగ్ ఇచ్చింది. కానీ.. చైనా ఆర్మీలో చాలామందికి యుద్ధ భూమిలో అనుభవం లేదు. కేవలం టెక్నాలజీపై భారమేసిన చైనా ఆర్మీ శక్తిసామర్థ్యాలను ఎక్కువగా అంచనా వేసుకుంది. కానీ గ్రౌండ్ లెవల్లో సరిహద్దుల్లో చీనీ సైన్యం ఎంత వరకూ భారత ఆర్మీను నిలువరిస్తుందనే అంశంపై క్లారిటీకు రాలేకపోతుంది.
చైనాలో ప్రజలు స్వచ్ఛందంగా ఆర్మీలో చేరాలనే నిబంధన ఉంది. దీన్ని అవకాశం చేసుకుని భారీగా యువతను సైన్యంలోకి చేర్చుకుంటున్నారట. మరోవైపు తమ వైమానిక సత్తాను చైనా ప్రజలకు చెప్పేందుకు కొన్ని హాలీవుడ్ సినిమాల్లోని సీన్లను కాపీ చేసి మరీ ప్రచారం చేస్తున్నారట. ది హర్ట్ లాకర్, ట్రాన్స్‌ఫార్మర్, రివెంజ్ ఆఫ్ ది ఫాలెన్ సినిమాల్లోని సీన్లను ప్రజల్లోకి వదులుతూ చైనా సైనికులు ఎంత అరవీరపరాక్రములు అనేది ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తుందట. కానీ.. అక్కడ కూడా ఇవన్నీ హాలీవుడ్ సినిమాల్లోవని తెలియటంతో ఇంటా.. బయటా పరువు పోగొట్టుకున్నపీపుల్ లిబరేషన్ ఆర్మీ.. కొత్త ఎత్తుల కోసం ప్రయత్నిస్తుందట.
తాజాగా ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కొత్త ఎత్తుగడ వేసింది. భారతదేశాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించింది. చైనా ప్రోద్బలంతో మరోసారి కశ్మీర్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. గతంలో తమ వద్ద 40,000 మంది ఉగ్రవాదులున్నారని చెప్పి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. భారత్ ఉగ్రవాద దేశంగా చెప్పాలని బొక్కబోర్లాపడ్డారు. ఇప్పుడు పాక్ ప్రతినిధులు కూడా.. కశ్మీర్ విషయాన్ని రచ్చ చేయాలని ప్రయత్నించింది. కశ్మీర్ తమ అంతర్గత విషయమని భారత్ ఘాటైన హెచ్చరికతో సమాధానమిచ్చింది.