గేట్ వే ఆఫ్ ఇండియా సిటీలో కంగనా.. దేశంలో కరోనా.. ఇండియా బోర్డర్‌లో చైనా.. మూడు ఒకదానికి మించి మరొకటి పోటీపడుతున్న అంశాలు. వైరస్‌లా వ్యాపించి దుమ్ముదుమారం రేపుతున్నాయి. 2020లో ఈ మూడు సంచలనాలు.. జనాన్ని ఒకింత అసహనానికి.. ఆందోళనకూ గురిచేస్తున్న అంశాలు. చైనా అతి ఆత్మవిశ్వాసం.. విస్తరణ వాదానికి పరాకాష్ట. చైనా మొదట్లో 30 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది.. క్రమంగా అది 90 లక్షల చదరపు కిలోమీటర్లకు చేరింది. అంటే.. దాదాపు 60 లక్షల చదరపు కిలోమీటర్ల వరకూ ఆక్రమించుకున్నదే. దానిలో భారతదేశ భూభాగం 90 వేల చదరపు కిలోమీటర్లకు పైగా ఉందని.. 1962 నుంచి 2020 వరకూ చైనా చేసిన అక్రమణలకు ఇది రుజువంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ప్రకటించారు. నిజానికి చైనా దూకుడు ఇప్పుడు కొత్తేం కాదు. చాలా తెలివిగా.. వ్యవహరిస్తూ చిన్న దేశాలను కబళిస్తూ వచ్చింది. భారత్‌ను కూడా అదేదారిలో భయపెట్టడం ద్వారా దారికి తెచ్చుకోవాలనే పథకం వేసింది. ఎందుకంటే.. ప్రపంచంలో దాదాపు 162 దేశాలు చైనా ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నాయి. ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా చైనా తయారు చేసే ఉత్పత్తులు, దిగుమతులపై ఆధారపడ్డాయి. అదే చైనాకు కలసివస్తుంది. కరోనా సమయంలో దాన్ని బూచిగా చూపుతూ విస్తరణ కాంక్షను బయటపెట్టుకుంది. కానీ.. అంతర్జాతీయంగా పెల్లుబుకుతున్న వ్యతిరేకతను ఊహించలేకపోయింది. కరోనా వేళ ఆర్ధికంగా కుంగిపోతున్న దేశాలు తమకు అవసరమైన ఉత్పత్తులను తామే తయారు చేసుకోవాలనే నిర్ణయానికి రావటం చైనా ఎగుమతులకు భారీగా చెక్ పెట్టబోతున్నాయి. రాబోయే ఐదారేళ్లలో చైనా తయారీ రంగానికి దాదాపు చరమగీతం పాడే అవకాశాలు లేకపోవంటున్నారు ఆర్ధికరంగ నిపుణులు.
కరోనా భారత్‌ను కలవరపెడుతోంది. మరణాల రేటు కేవలం 1.6 శాతం మాత్రమే ఉన్నా.. వేగంగా విస్తరిస్తున్న కొవిడ్19 పాజిటివ్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజూ 90,000 కేసులు దాటుతున్నాయి. రాబోయేది శీతాకాలం మూడు నెలల పాటు ప్రతిరోజూ మూడు రెట్లు కేసులు పెరిగే అవకాశం లేకపోలేదు. మరోవైపు చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లకు యుద్దమే సమాధానం కావాల్సి వస్తే.. ఇప్పటికే కూలబడిన ఆర్ధిక వ్యవస్థతో మున్ముందు పరిస్థితులు ఊహించలేకపోతున్నారు. పాకిస్తాన్ కూడా ఏమైనా హద్దు మీరితే భారత్ మూడుపక్కల పోరాటా చేయాల్సి వస్తుంది. దీనికి భారతీయులు సిద్దంగానే ఉన్నా ఆర్ధికంగా ఎంత వరకూ నడుపుగలమనేది పెను సమస్య. ప్రజలు కూడా అన్‌లాక్ 4.0 నిబంధనల సడలింపుతో ఊపిరి పీల్చుకున్నారు. వైరస్ తగ్గిందనే ఉద్దేశంతో ఇష్టానుసారం రోడ్ల మీదకు వస్తున్నారు. ప్రస్తుతం 55 లక్షల కేసులున్నాయి. రాబోయే మూడు నెలల్లో కోటి వరకూ చేరుతాయనే ఆందోళన కూడా వైద్యనిపుణుల నుంచి వస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా 135 కోట్ల మంది ప్జజలకు అందించటం కష్టసాధ్యం.. దాదాపు రెండుమూడేళ్లపాటు అందించాల్సి ఉంటుంది. ఈ లోపుగా.. వ్యక్తిగత జాగ్రత్తలే శ్రీరామ రక్ష అంటున్నారు శాస్త్రవేత్తలు.
కంగనా రనౌత్.. హిమాచల్‌ప్రదేశ్‌లో పుట్టిన అందాల సుందరి.. ముంబైలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే వేగంగా ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర వేసుకుంది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న గొప్పనటి కూడా.. అన్నింటా ముందుండే కంగనా.. ప్రతిసారీ తేనెతుట్టెను కదుపుతూనే ఉంటుంది. ఇప్పటి వరకూ అవన్నీ ముంబైకే పరిమితయ్యాయి. ఇప్పుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక వాస్తవాలు గుర్తించాలంటూ మూడు నెలల క్రితమే కంగనా నిప్పు రాజేసింది. అది క్రమంగా బాలీవుడ్‌ను దహనం చేసేంత వరకూ చేరింది. ఎంపీ జయాబచ్చన్ కూడా స్పందించి.. కంగనాను తప్పుబట్టారు. కొందరు కంగనాను ఝాన్సీ లక్ష్మి అంటూ ప్రశంసిస్తే.. మరికొందరు ఆమె సినిమాలోనే ఝాన్సీ అంటూ ఎద్దేవా చేసిన వారూ ఉన్నారు. ఒక హీరో ఆత్మహత్య ఘటన చివరకు.. మహారాష్ట్ర, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాల గొడవకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్‌వాల్వు చేసింది. కాంగ్రెస్‌ను విమర్శించిన కంగనా ఫ్యామిలీ.. బీజేపీ సర్కారుకు జై కొట్టారు. రాజకీయంగా కూడా కంగనా మరోసారి కలకలం సృష్టించారు. ఇలా.. కరోనా.. చైనా మీడియాలో రచ్చ చేస్తున్న సమయంలో.. కంగనా కూడా నేనున్నానంటూ 2020లో టీ20 క్రికెట్ మ్యాచ్‌ను తలపిస్తున్నారన్నమాట.