శశికళ అలియాస్ చిన్నమ్మ మరో పది రోజుల్లో జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఓకే.. తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు డబుల్ ఓకే. అయితే ఏంటట.. అనుకోవచ్చు. చిన్నమ్మ రాక వెనుక ఎవరున్నారు. ఏ స్థాయిలో మంత్రాంగం నడిచిందనేది బహిరంగ రహస్యం. అవినీతి, అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేసేందుకు అర్హురాలు కాదు. కాబట్టి.. ఏఐడీఎంకే తరపున ఆమె వ్యూహకర్తగా చక్రం తిప్పబోతున్నారనేది విశ్లేషకుల అంచనా. వచ్చే ఏడాది తమిళనాట ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. దక్షిణాధిన పాగా వేయాలను బీజేపీ తమిళనాడు రాజకీయాలను ఎంత వరకూ ఆక్రమిస్తుందనేది చర్చనీయాంశం. తమిళనాటు రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత వంటి వారు లేకుండా జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు. ఇప్పటి వరకూ డీఎంకే, అన్నా డీఎంకే రెండూ పార్టీలు.. ఆ ఇద్దరి కనుసన్నల్లోనే నడిచాయి. వ్యూహమైనా.. ప్రతి వ్యూహమైనా వారి నోటి నుంచి రావాల్సిందే. దీంతో ద్వితీయనాయకత్వ సమస్య రెండు పార్టీలను వెంటాడుతుంది. జాతీయపార్టీలున్నా.. అరవరాష్ట్రంలో వాటి మనుగడ అంతంతమాత్రమే. ప్రాంతీయపార్టీలను అంటిపెట్టుకుని.. కేంద్రంలో పాగా వేసేందుకు పావులుగా వాడుకుంటూ వస్తున్నాయి.
కానీ వచ్చే ఏడాది తమిళనాట ఎన్నికల ప్రత్యేకతలు వేరు.. స్టార్‌లు. సూపర్‌స్టార్‌లు ఎంత మంది కొత్తపార్టీలతో అదృష్టం పరీక్షించుకునేందుకు వస్తారనేది తేలాల్సి ఉంది. ఖుష్బూ కూడా బీజేపీలోకి చేరి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. జయలలిత తరువాత మహిళా సీఎంగా ఖుష్బూ ఉండాలనే తపన కూడా ఆమెలో కనిపిస్తుంది. జయలలిత తరువాత అంతటి పాపులారిటీ ఉన్న చిన్నమ్మ ఈ సమయంలో జైలు నుంచి విడుదల కావటం ఏఐడీఎంకేను ఒకింత బాధ.. మరింత సంతోషాన్ని కలిగిస్తుందట. ఎందుకంటే. ఇప్పటికే పన్నీర్‌సెల్వం, పళినిస్వామి మధ్య కుదిరిన రాజీ మేరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ భుజాలు భుజాలు రాసుకుంటూ రేపటి గెలుపుకోసం ఇద్దరు సిద్ధమయ్యారు. వైరాన్ని పక్కనబెట్టి కలసి కట్టుగా నడుద్దామని నిర్ణయించుకున్నారు. ఇటువంటి సమయంలో శశికళ రాక.. వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచుతుందంటున్నారు విశ్లేషకులు. చిన్నమ్మకు పళినిస్వామి పట్ల పాజిటివ్ దృక్పథం ఉన్నట్టుగా ప్రచారం లేకపోలేదు. పన్నీర్‌సెల్వం కేవలం అమ్మ నమ్మినబంటుగా ముద్రపడటం చిన్నమ్మ జీర్ణించుకోలేకపోతుందట. కాబట్టి.. పళినితో రాజకీయం చేయించటం ద్వారా తన పంతం నెరవేర్చుకుంటుందనే వాదనలూ వినిపిస్తున్నాయి.