దుబ్బాక ఉప ఎన్నిక మూడు పార్టీలకూ ముచ్చెమట్లు పట్టిస్తున్నాయి. నవంబరు 3వ తేదీ ఉప ఎన్నికల జరగనుంది. 10వ తేదీ ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఉప ఎన్నిక అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే.. బీజేపీ ఇది చావో రేవో అనేంతగా బావిస్తుంది. రెండుసార్లు వరుసగా ఓడిన రఘునందన్‌రావును ఈ సారి ఓటర్లు ఆశీర్వదిస్తారనేది కమలం పార్టీ ధీమా. ఇప్పటికే బీజేపీ, టీఆర్ ఎస్ అంటే జనం విరక్తితో ఉన్నారని కాబట్టి హస్తం పార్టీదే గెలుపు అంటూ కాంగ్రెస్ భావిస్తోంది. నిజానికి అక్కడ మూడు పార్టీలు సెంటిమెంట్‌ను నమ్ముకున్నాయి. రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక ఖరారైంది. ఆయన సతీమణి సుజాతను టీఆర్ ఎస్ అభ్యర్థిగా నిలిపింది. మంత్రి హరీష్‌రావు అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు.
వాస్తవానికి దుబ్బాకలో టీఆర్ ఎస్ ఇంతగా శ్రమించాల్సిన అవసరం లేదు. రామలింగారెడ్డి పట్ల ప్రజల్లో మంచి అభిమానం ఉంది. ఆయన కుటుంబ పట్ల కూడా అదే గౌరవం. కానీ.. టీఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరు క్రమంగా ప్రజావ్యతిరేకతను కొని తెస్తోంది. మీడియా గొంతునొక్కారనేది తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ముందస్తు ఎన్నికల్లో విజయం వరించినా ఆ తరువాత 2019లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు నష్టపోయారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇంత మూల్యం చెల్లించాల్సి రావటాన్ని కారు పార్టీ జీర్ణించుకోలేకపోయింది. పైగా నవంబరు, డిసెంబరు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగబోతున్నాయి. కానీ భారీవర్షాలు, వరదలతో హైదరాబాద్ జనం.. టీఆర్ ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లపై తిరగబడుతున్నారు. కొందరు బాధితులు బౌతికదాడులు కూడా చేశారు.
ఇటువంటి సమయంలో దుబ్బాక ఉప ఎన్నికలపై ప్రభావం చూపుతుందనేది టీఆర్ ఎస్ భయం. దీన్ని మనమే ఉపయోగించుకోవాలనేది బీజేపీ వ్యూహం. వాస్తవానికి రఘునందన్‌రావు పట్ల దుబ్బాకలో సానుకూల అభిప్రాయం ఉంది. ఓటర్లు కూడా ఆయన వైపు మొగ్గుచూపుతున్నారట. ఇటీవల ఓ సంస్థ చేపట్టిన సర్వేలోనూ బీజేపీ వైపు ఓటర్లు పాజిటివ్‌గా ఉన్నారని తేల్చారు. మరి దీన్ని ఎంత వరకూ బీజేపీ ఉపయోగించుకుంటుంది.. అనుకూలమైన ఓటర్లను పోలింగ్ బూత్ ల వద్దకు ఎలా రప్పించుకుంటుందనేది.. ఆ పార్టీ నిర్ణయించుకోవాలి. ఈ సారి విజయం ఏ మాత్రం చేజారినా.. దీనికి బీజేపీ భారీమూల్యమే చెల్లించాల్సి ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. 6 మండలాలు.. ఒక మున్సిపాలిటీ ఉన్న దుబ్బాకలో 2 లక్షల మంది ఓటర్లున్నారు. చేనేత, బీడీ కార్మికులున్నారు. కేసీఆర్ పాలనపై ఉన్న వ్యతిరేకత తమకు కలసి వస్తుందనేది రఘునందన్‌రావు చెబుతున్నారు. మల్లన్నసాగర్ ముంపు వల్ల నష్టపోయిన రైతులకు ఇంత వరకూ నష్టపరిహారం ఇవ్వలేదంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది.