దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచేదెవరు? ఓడేదెవరు? ఎవరి లెక్కలు వారికే ఉన్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఎగ్జిట్ పోల్ సర్వేలతో సంతృప్తి పడుతుంది. ఓటింగ్ శాతం కూడా బాగానే ఉండటంతో ఇది తమకే అనుకూలమంటూ అధికార టీఆర్ ఎస్, అబ్బే అదేం కాదు. మాదే విజయమంటూ బీజేపీ లెక్కలు కట్టుకుని మరీ ఖుషీ అవుతున్నారు. కానీ.. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలవటం ఆనవాయితీగా వస్తుంది. పైగా కేసీఆర్ పద్మవ్యూహంలో కమలం గిలగిలలాడింది. సరైన నాయకత్వం లేకపోతే ఏ పార్టీ అయినా ఎలా మారుతుందనేందుకు హస్తం ఉదాహరణగా నిలిచింది. ఇలా.. ఇద్దరు ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీయటమే గాకుండా.. ఎన్నికల ముందు బీజేపీ నేతలను అల్లర్లంటూ హైదరాబాద్‌కే పరిమితం చేయటంలో టీఆర్ ఎస్ విజయం సాధించింది. డబ్బుల పంపిణీ యదేచ్ఛగా జరిగినా అది అధికార పార్టీకే లాభం చేకూర్చుతుందనేది అర్ధమవుతోంది.
రఘునందన్ పై ఓటర్లలో సానుభూతి ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వల్లనే నియోజకవర్గానికి నిధులు వస్తాయనే సామాజిక సృహ.. తెలియని భయం కూడా సగటు ఓటర్లను అభ్యర్థితో సంబంధం లేకుండా అధికార పార్టీ వైపు నడిపిస్తాయి. ఇప్పుడు కేసీఆర్ విషయంలో అదే జరిగింది. ఎంత విమర్శించినా తెలంగాణలో సరైన నాయకుడుగా కేసీఆర్ అనేది
తెలంగాణ ప్రజల మనసులో బలంగా నాటుకుపోయింది. అయితే.. 2018లో 86శాతం, ఇప్పుడు 85శాతం ఓటింగ్ జరిగింది. ఒక్కశాతం ఓటు సంగతి ఎలా ఉన్నా.. లక్ష ఓట్లతో కారు దూసుకెళ్లటం ఖాయమనేది మాత్రం ఆ పార్టీ వేసుకున్న అంచనా. దుబ్బాక ఉప ఎన్నిక పోరు ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యాయి. అయితే పోలింగ్ ముగిసిన అనంతరం పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. థర్డ్ విజన్ రీసెర్స్ అండ్ సర్వీస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో 51-54 శాతం ఓట్లతో కారు గుర్తు అభ్యర్థి సుజాతకు మొదటి స్థానం, 33-36 శాతం ఓట్లతో బీజేపీ క్యాండిడేట్ రఘునందన్‌కు రెండోస్థానం. కేవలం 8-11 శాతం ఓట్లతో మూడోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాసరెడ్డి ఉంటారని తేల్చారు. పొలిటికల్ ల్యాబోరేటరీ ఆర్గ నైజేషన్ మాత్రం బీజేపీ గెలుపు అంటుంది. 47 శాతం ఓట్లతో రఘునందన్ గెలుపు గ్యారంటీ అంటూ చెబుతున్నారు. టీఆర్ ఎస్ 38శాతం ఓట్లతో రెండు, కాంగ్రెస్ 13శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమవుతుందంటూ పేర్కొనటం కొసమెరుపు.