సిద్దిపేట జిల్లాలో అదో నియోజకవర్గం. అసలు దుబ్బాక అంటే తెలియని వాళ్లు చాలామందే ఉంటారు. అపుడెపుడో ముత్యంరెడ్డి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నపుడు వినిపించిన పేరే అది. పాడి,పంటలను ప్రోత్సహించిన ముత్యంరెడ్డి అంటే ఇప్పటికీ అక్కడ జనాలకు ఎంతో అభిమానం. రాజకీయంగా చెప్పాలంటే.. కేసీఆర్, ముత్యంరెడ్డి ఇద్దరిలో ఎవరికి మంత్రిపదవి ఇవ్వాలనే తర్జనభర్జనల్లో ముత్యంరెడ్డికి మంత్రి పదవి దక్కింది. కేసీఆర్‌కు కోపం వచ్చింది. టీఆర్ ఎస్ పుట్టుకకు అదే పునాది పడింది.. అంటారు విశ్లేషకులు.. ఇప్పుడు అదే దుబ్బాక మరోసారి టీఆర్ ఎస్ పునాదులు కదులుతాయంటూ బీజేపీ అభ్యర్ధిని గెలిపించటం ద్వారా సంకేతాలు పంపినట్టయింది. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామంటూ.. ప్రజల నాడి తెలియకుండా సవాల్ విసిరిన నేతలకు ఓటరు
ఇచ్చిన సమాధానం ఎన్నో రాజకీయ లెక్కలను సరిచేయనుంది.
మళ్లీ ఇన్నాళ్లు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. జాతీయస్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అంటేనే కేసీఆర్. కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఇక్కడ గెలుపును శాసించాలన్నా.. ఓటరు వేలిగుర్తుపై నల్ల ఇంకు చుక్క మెరవాలన్నా కేసీఆర్ హుకుం కావాలి. ప్రత్యేక రాష్ట్ర సాధనకు కేసీఆర్ మాత్రమే పోరాటం చేశారు. మిగిలిన ఉద్యమకారులు, పార్టీలు, నాయకులు, మేధావులు, విద్యార్థులు వీరంతా చేసిన త్యాగాలు అన్నీ కేసీఆర్ గాలివాటంలో కొట్టుకుపోయాయి. భారతదేశ రాజకీయాల్లో దేశభక్తి అనేది ఒక ఎమోషన్. అదే బీజేపీ స్లోగన్‌గా విజయావకాశాలను తెచ్చిపెడుతోంది. సర్జికల్ స్ట్రయిక్స్, ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్లు, కశ్మీర్ 370 అధికరణ రద్దు, రామమందిరం ఇవన్నీ బావోద్వేగాలతో కూడిన అంశాలు. అందుకే.. పాకిస్తాన్ ను బూచిగా చూపుతూ భారతీయ ఓటర్లను తమ వైపునకు తిప్పుకుంటున్నారు.
సేమ్ టు సేమ్ ఇదే ఎత్తుగడను తెలంగాణలో ఆంధ్ర వ్యతిరేకతను ప్రచారస్ర్తంగా మలచుకుని కేసీఆర్ రెండు సార్లు విజయం సాధించారు. నిధులు, నీళ్లు, నియామకాల సంగతి వచ్చిన ప్రతిసారీ.. ఆంధ్రపాలకులు చేసిన తప్పిదాలను.. చంద్రబాబును దోషిగా చూపుతూ కప్పదాటు వైఖరి అవలంభిస్తూ వస్తున్నారు. అయినా.. ఏ మీడియా ఆయన్ను నిలదీయకూడదు. ఏ ఒక్క జర్నలిస్టు కూడా ప్రశ్నించకూడదు. ఎవరైనా మీడియా సమావేశంలో నోరు తెరవబోతే.. నీకేం తెలుసంటూ మీరు ఒట్టి వెదవలోయ్ అనేంతగా చులకన చేసి పారేస్తుంటారు. మీడియా హౌస్‌లన్నీ ఆంధ్రవాళ్లవి కావటంతో ఎవ్వరూ కలానికి స్వేచ్ఛనిచ్చే సాహసం చేయరు. ఒకవేళ చేసినా మరుసటి రోజు ఫోన్ల మీద ఫోన్లు. జర్నలిస్టులు కూడా ఆత్మాభిమానం చంపుకుని విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి. అంతా మాకే తెలుసు.. ఎవరైనా మా తరువాతనే అనే దొరపెత్తనానికి స్వస్తి పలికేందుకు దుబ్బాక వేసిన దారి ఎన్నో లెక్కలు సరిచేసింది. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన టీడీపీ, కాంగ్రెస్. అదే మార్గంలో ఇపుడు టీఆర్ ఎస్.. ప్రజల అబీష్టాన్ని కాదని.. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ప్రజల నుంచి ఎలాంటి తిరస్కారం ఎదుర్కోవాల్సి వస్తుందని రుచిచూపారు దుబ్బాక ఓటర్లు. రెండేళ్ల క్రితం 2018ముందస్తు ఎన్నికల్లో 62000 పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచిన చోట.. 1500 ఓట్ల మెజార్టీతో ఓడిపోవటం టీఆర్ ఎస్ ఉనికికే ప్రమాదమనే సంకేతాలు పంపింది.
సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సమీపంలో ఉండే దుబ్బాక జనం ఇచ్చిన తీర్పు వెనుక… ఆంతర్యం ఇప్పటికైనా రాజకీయపార్టీలు.. నేతలు అర్ధం చేసుకోగలిగితే ఎన్నో చేదు నిజాలు .. ప్రజల మనసులో గూడుకట్టుకున్న ఆలోచనలను అంచనా వేయగలుగుతారు. పాలకుల నుంచి ప్రజలు కోరుకుంటున్న మార్పును తెలుసుకోగలుగుతారు. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాదు.. ఏపీలోని రాజకీయపార్టీలకు కూడా దుబ్బాక గొప్ప గుణపాఠం నేర్పింది. కొత్త మార్గానికి దిశానిర్దేశం చేసింది.