దుబ్బాక ఉప ఎన్నికలు వేడేక్కాయి. మూడు ప్రధాన పార్టీలు చావోరేవో అన్నట్టుగా లెక్కలు వేసుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితు ల్లోనూ సీటు చేజారకూడదని అధికార టీఆర్ ఎస్ పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. మంత్రి హరీష్‌రావు చాణక్యతకు ఈ ఉప ఎన్నిక పెనుసవాల్‌గా మారిందనే చెప్పాలి. కేసీఆర్‌కు ఎదురుగాలి మొదలైందనే చాటేందుకు ఇక్కడ గెలిచితీరాలని కాంగ్రెస్, భాజపాలు భావిస్తున్నాయి. ఎవరికి వారే పైకి గంబీరంగా కనిపిస్తున్నా.. దుబ్బాక ఓటర్లు ఇవ్వబోయే తీర్పు మూడు పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రెండు లక్షల ఓటర్లున్న దుబ్బాక నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో సోలిపేట టీఆర్ ఎస్ అభ్యర్ధి రామలింగారెడ్డి విజయం సాధించారు. ఇటీవల ఆయన మరణించటంతో ఉప ఎన్నికలు తప్పలేదు. సెంటిమెంట్ కలసి వస్తుందనే ఉద్దేశంతో రామలింగారెడ్డి బార్య సుజాతను బరిలోకి దింపారు. బీజేపీ తరపున రఘునందన్‌రావు కూడా తన లక్‌ను మరోసారి పరీక్షించుకోవాలనే ఆలోచనతో నామినేషన్ వేశారు. పేరుకే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం.. టీఆర్ ఎస్, బీజేపీ అన్నట్టుగా సాగుతున్నాయి. ఇటీవల రఘునందన్‌రావు , బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు జరపటం వివాదాస్పదంగా మారింది. దీనిపై సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్‌పై పలు ఆరోపణలు చేసింది బీజేపీ పార్టీ. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారిని నియమించింది.
డబ్బు సంచులతో గెలవాలని బీజేపీ చూస్తుందనే టీఆర్ ఎస్ ప్రచారం కారుకు ఎదురుతిరిగింది. రఘునందన్‌రావుపై పోలీసుల దాడి తరువాత ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష మెజార్టీతో కారు దూసుకెళ్లటం ఖాయమంటూ హరీష్‌రావు చెబుతున్నారు. కేసీఆర్ కూడా తమ గెలుపును ఆపటం ఎవరి తరమూ కాదంటూ ధీమా వ్యక్తంచేశారు. సిద్ధిపేట అంటేనే.. టీఆర్ ఎస్ అనే ముద్ర ఉంది. అటువంటి చోట.. ఏ మాత్రం ఓటర్లు.. అధికార పార్టీను ఛీకొట్టినా భారీమూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందనే భయం కూడా గులాబీ శ్రేణుల్లో లేకపోలేదు. అదే సమయంలో కమలం పార్టీకు ఇది ప్రతిష్ఠాత్మకమైన ఉప ఎన్నిక. గెలుపు సంగతి ఎలా ఉన్నా.. గతానికి భిన్నంగా ఎక్కువ ఓట్లు
సంపాదించటం ద్వారా తాము పై చేయి సాధించామని చెప్పుకోవాలని భావిస్తుంది. ఓట్ల చీలికతో తాము లాభపడతామని కాంగ్రెస్ లెక్కలు కడుతోంది. ఎవరి లెక్కలు ఎలా ఉన్న.. దుబ్బాక ఓటర్లు ఏ పార్టీ తిక్క కుదుర్చుతారనేది మాత్రం సస్పెన్స్.



