వావ్.. వాట్ ఏ పాలిట్రిక్స్. ఎవరి లాభం.. ఎవరి రాజకీయం వాళ్లది. పాలిటిక్స్‌లో మర్డర్ ఉండదు.. సూసైడ్ మాత్రమే అంటూ ఆ నాడే కాదు.. ఈ నాడు కూడా కళ్లెదుట కనిపిస్తూనే ఉంది. అప్పట్లో నీలం సంజీవరెడ్డిని కుర్చీ దించి బ్రహ్మానందరెడ్డికి పగ్గాలిచ్చారు. రోశయ్యను కాదని… కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవి కట్టబెట్టారు. ఎన్టీఆర్ వెనుక లక్ష్మీపార్వతి చక్రం తిప్పుతుందటూ రాత్రికి రాత్రే పెద్దాయనను పదవి లేకుండా చేశారు. ఇక్కడ అధికారమే కీలకం.. దానికోసం వెన్నుపోట్లు.. ముందుపోట్లు అన్నీ కామన్. నాటి ఎన్టీఆర్ నుంచి నేడు కేసీఆర్ వరకూ…. సంజీవరెడ్డి నుంచి జగన్ మోహన్‌రెడ్డి వరకూ ఎవ్వరూ అతీతులు కాదు. అయితే.. అప్పుడు ఉన్నవాళ్లంతా రాజకీయ ఉద్దండులు. చదరంగంలో పావులను కదిపినంత తేలికగా.. సైలెంట్‌గా రాజకీయాలు చేస్తూ ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఎత్తులు వేసేవారు. ఇప్పుడంతా ఎమోషనల్ పాలిటిక్స్… అవతలి వారిని బలహీన పరచటం ద్వారా తాము బలపడాలనే తపనే ఇప్పటి పొలిటీషియన్లలో కనిపిస్తుంది. అయితే వారిలో పరిణితి ఎంత వరకూ ఉంది.. ప్రజాబలం ఉందా! లేదా! అనేది అప్రస్తుతం. ఎందుకంటే… గెలుపోటములు నాయకుల గుణగణాలకంటే.. ప్రజల ఎమోషన్స్ మీదనే ఆధారపడి నడుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఉద్యమం అనే సెంటిమెంట్ తెలంగాణ అనే రాష్ట్ర సాధనతో కేసీఆర్ తిరుగులేని నేతగా ఎదిగారు. సీఎం కాగలిగారు. ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతుందనే ప్రతిసారీ ఆయన నోటి వెంట వచ్చేది జై తెలంగాణ.. ముర్దాబాద్ ఆంధ్ర. ఇటువంటి నాయకత్వం ఉన్నచోట.. ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల. తెలంగాణ ఉద్యమంలో కుడిభుజంగా ఎదిగిన ఈటల రాజేందర్… తెలంగాణలో కొత్త రాజకీయాలకు.. సరికొత్త సమీకరణలకు తెరలేపారు. ఇదంతా ఎంత వరకూ సాధ్యమనేది పక్కనబెడితే కేసీఆర్‌కు చెరోవైపు గుంపు కడుతున్నారు. మున్ముందు గత్తర గత్తర చేస్తామంటూ గీరాలు పోతున్నారు. మరి ఇదంతా తాత్కాలికమా.. రాబోయే ఉపదృవానికి సంకేతమా!