రైతులంటేనే శాంతికి గుర్తు. అటువంటి కర్షకులు కదనానికి కాలు దువ్వుతారా! పొలం గట్లపై కాటేస్తుందని తెలిసినా దణ్నంపెట్టి పక్కకు తప్పుకునే అన్నదాతలు ఇంత ఆగమాగం చేస్తారా! ఔను.. ధిల్లీ రైతు ర్యాలీలో జరిగిన గొడవపై పలు అనుమానాలున్నాయి. ఎన్ ఐఏ వంటి నిఘా సంస్థలు ముందుగానే హెచ్చరించినా డిల్లీ పోలీసులు లైట్ తీసుకున్నారు. బారీకేడ్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఫలితంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట వద్దకు యదేచ్ఛగా రైతుల ముసుగులో కొందరు చేరారు. ఎర్రకోట వద్దకు వెళ్లటం అంటే దేశరాజధాని నడిబొడ్డున జెండా పాతటమే. అది కూడా గణతంత్ర వేడుకలు జరుగుతుండగా వెళ్లటం దేశభద్రతకే సవాల్ విసిరినట్టుగా నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే దిల్లీ అల్లర్ల వెనుక ఉన్న పంజాబ్ నటుడు దీప్‌సిద్దు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడు రెచ్చగొట్టే కామెంట్స్ చేయటం వల్లనే యువత ఉద్రేకపూరితులయ్యారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అతడి సోదరుడు మనుదీప్ సింగ్ కూడా రైతు ర్యాలీ గాడి తప్పేందుకు కారణమయ్యారట.
కేంద్రం తెచ్చిన రైతు చట్టాలపై 60 రోజులుగా ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో రైతులు శాంతియుతంగా నిరసన చెబుతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్ల ర్యాలీకు అనుమతి పొందారు. కానీ నిబంధనలు ఉల్లంఘించిన లక్షలాది మంది వేలాది ట్రాక్టర్లతో విధ్వంసం సృష్టించటం భద్రతా బలగాలను సైతం విస్మయానికి గురిచేసింది. అందుకే.. దీనిపై కేంద్రం సీరియస్‌గా వ్యవహరించనుంది. అయితే రైతులపై ఇప్పటికే 20 వరకూ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎవరెవరు రెచ్చగొట్టారు. అసలు డిల్లీలో వారు ఏం చేయాలని ప్లాన్ చేశారనే వివరాలు కూపీ లాగుతున్నారు. ఏమైనా వీటి వెనుక పాకిస్తాన్, చైనా వంటి శత్రుదేశాల కుట్రకోణం ఉందా! అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారట. ఇప్పటికే భారత్‌పై రగిలిపోతున్న ఇరు దేశాలు ఇక్కడ జరిగే ప్రతి సంఘటనను సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. దీనికి పరోక్షంగా కొన్ని విపక్షాలు కూడా కొమ్ము కాస్తున్నాయనే అనుమానాలు లేకపోలేదు. ఏమైనా దిల్లీలో జరిగిన రచ్చ మామూలు గొడవగా పరిగణించే పరిగణించే ప్రసక్తే లేదని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.