ఏం రాజకీయాలో ఒక పట్టాన అర్ధం కావు. అన్నీ తెలిసినట్టే ఉంటాయి.. అంతలోనే మారిపోతుంటాయి. విశాఖజిల్లాలో కీలకమైన నేత గంటా శ్రీనివాసరావు . టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వైసీపీ అఖండవిజయం. భవిష్యత్‌లో టీడీపీ జెండా ఎగురు తుందనే నమ్మకం సన్నగిల్లుతోంది. పైగా ఇప్పటికే భూ వ్యవహారాలు, బ్యాంకుల్లో అప్పులు గంటాను సంకటస్థితిలో నెట్టేశాయి. వైసీపీ అధికారం చేపట్టిన కొద్ది వ్యవధిలోనే సిట్ ఏర్పాటు చేసిన అక్రమ భూదందాలపై దర్యాప్తు కూడా జరిపారు. ఆ సమయంలోనే గంటా పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ఏపీలో బీజేపీ బలాన్ని పెంచేందుకు కాషాయ కండువా కప్పుకుంటారనే గుసగుసలూ వినిపించాయి. అంతలోనే తూచ్.. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారంటూ కథనాలు. కానీ ఆ తరువాత అవన్నీ మరుగున పడ్డాయి. తాజాగా గంటా శ్రీనివాసరావు దాదాపు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం ఊపందుకుంది. తానై వెళితే చులకన అవుతాననే భయంతో గంటా ఆచితూచి స్పందిస్తున్నారట. కావాలనే తాను బీజేపీలోకి వెళ్లబోతున్నట్టు హింట్ ఇచ్చి డిమాండ్ పెంచుకునే పనిలో పడ్డారట. గంటా రాకను వైసీపీ ఓకే చెబుతున్నా.. అవంతి శ్రీనివాస్ అడ్డంకిగా మారాడు. అందుకే. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ సీనియర్ నేతలు రంగంలోకి దిగారట. గంటా రావటం వల్ల వైసీపీకు మరింత బలం చేకూరుతుందనే ఆలోచన వైసీపీ శ్రేణుల్లో ఉంది. అయితే అవంతి అంగీకరించాకే పార్టీ మారేందుకు సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు గంటా. పీఆర్‌పీ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా రెండుసార్లు కూడా మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇప్పుడు వైసీపీలోకి వస్తే..తాను ఇష్టపడుతున్న వీఎంఆర్‌డీఏ(విశాఖపట్టణం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఛైర్మన్ పదవి ఆశిస్తున్నారట. ఏమైనా. గంటా ఆడుతున్న దొంగాటకు ముగింపు ఎప్పుడో అనేది ఆసక్తికరంగా మారిందన్నమాట.