గృహిణులకు వంటికి ఆభరణం బంగారం.. వంటింటికి అవసరం ఉల్లి. రెండు ధరలు మహిళలపై తీవ్రప్రభావం చూపుతాయి. ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. కరోనా సమయంలో ఉల్లి ఎంతో ఆరోగ్యకరం అంటున్నారు వైద్యులు. అటువంటి ఉల్లి ధరలు పెరిగితే సగటు మహిళలు ఊరుకుంటారా.. నడుం బిగించి మరీ పోరాటానికి దిగకుండా ఉంటారా.. ఇప్పుడు అదే భయం అధికార పార్టీలను కలవరపెడుతుంది. బిహార్, తమిళనాడు, గ్రేటర్ హైదరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఉల్లి ఎక్కడ తమ గెలుపును దెబ్బతీస్తుందనే భయం కూడా ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతోందట. మరి ఉల్లా.. మజాకా!
ఉల్లిగడ్డ.. ఓస్ ఇంతేగా! కిలో రూ.100. ఔనా అనుకోకండీ. ఉల్లి ధరలు పెరిగాయంటే.. కొనుగోలుదారులు ఎంత ఉలికిపాటుకు గురవుతారో.. ప్రభుత్వాలు కూడా అంతగా వణకిపోతారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల దెబ్బకు కూరగాయల ధరలు పెరిగాయి. కిలో బీర రూ.100 పచ్చిమిర్చి ఏకంగా 150 రూపాయలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతీది ధరాఘాతంగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఉల్లి ధర మరో ఎత్తు. ఎందుకంటారా! ఒకప్పుడు ఉల్లి ధరలు అమాంతం పెరగటంతో ప్రభుత్వాలే తలకిందులయ్యాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం.. యూపీ ఏ సర్కారులు రెండూ ఉల్లి దెబ్బకు అటుఇటుగా మారాయి. ఇప్పుడు ఉల్లి గడ్డల ధరలు ఏకంగా కిలో రూ.100కు చేరటం ప్రభుత్వాలను భయపెడుతుందట.
వాస్తవానికి ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో ఉల్లికి మంచి డిమాండ్ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలు తదితర ప్రాంతా ల నుంచి దిగుమతి అవుతాయి. ఎకరాకు సుమారు 50 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా. ప్రస్తుతం దిగుబడి 5-6 టన్నులకు తగ్గింది. దీంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. దళారులు కూడా భారీగా సరుకును నిల్వచేసి బ్లాక్ చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో మూడ్రోజుల క్రితం కిలో రూ.60 ఉన్న ఉల్లి ధర ఇప్పుడు రూ.80కు చేరింది. మరో రెండుమూడ్రోజుల్లో రూ.100కు చేరుతుందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా ఉల్లిగడ్డలు విక్రయిస్తుంది. అయినా.. కొరత తీరట్లేదు. కొనుగోలుదారులకు సరకు దొరక్క వెనక్కి తిరిగి వెళ్తున్నారు. రెండు గంటల్లోనే ఉల్లి తగ్గుతున్నాయి. దీంతో ఏదో విధంగా ఉల్లిని ప్రజలకు అందించేందకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కోస్తే కన్నీళ్లు తెప్పించే ఉల్లి.. కొనేటపుడే నీరు తెప్పిస్తున్నాయంటూ జనం సెటైర్లు వేసుకుంటున్నారు.