రాజధాని నగరంలో ఎన్నికల నగరా మోగింది. ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారిన ఈ ఎన్నికలపై నెల రోజులుగా తర్జనభర్జనలు జరుగుతూ వచ్చాయి. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీనిలో భాగంగా నవంబర్ 18- 20 వ తేదీ వరకూ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన చేస్తారు. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా స్వీకరిస్తారు. ఆ రోజే సాయంత్రం అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. డిసెంబర్ 1న ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 4న కౌంటింగ్, ఫలితాలు వెలువరిస్తారని పార్దసారధి వివరించారు. మంగళవారం ఉదయం 7 నుంచి డిసెంబరు 1వ తేదీ సాయంత్రం వరకూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టే. బీజేపీ, టీఆర్ ఎస్, టీడీపీ, ఏఐఎంఐఎం వంటి పార్టీలు గ్రేటర్ 2020 ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దుబ్బాక ఫలితం తారుమారుతో స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగి చక్రం తిప్పుతున్నారు. ఎమ్మెల్యేలకే కార్పోరేటర్లను గెలిపించుకునే బాధ్యతను అప్పగించారు. ఏ మాత్రం తేడాలొచ్చిన రాజకీయ భవిష్యత్ ఏమిటనేదానిపై ఎమ్మెల్యేల్లో తెగ గుస్సా అవుతున్నారట. వార్డు అధికారులు ఎవరనేది బుధవారం ప్రకటిస్తారు.
గ్రేటర్ లో మొత్తం 74,04, 286 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 38,5,77 0 మహిళలు 35,46 , 847 ఇతరులు 69 మంది ఉన్నారు. 2016 ఎన్నికల ప్రకారమే 150 వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఎన్నికలకు గానూ పోలింగ్ కేంద్రాలు 9248 ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ దఫా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. కొన్ని కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ ద్వారా ఎన్నికల ప్రక్రియ జరపునున్నారు. గ్రేటర్ పరిధిలో 79,290 మంది ఓటర్లతో మైలార్‌దేవ్‌పల్లి అతి పెద్ద డివిజన్‌గా నిలిచింది. 27,948 మంది ఓటర్లతో రామచంద్రాపురం అతిచిన్న డివిజన్ కావటం విశేషం. ఐపీఎల్ 2020ను మించి రసవత్తరంగా గ్రేటర్ 2020 ఎన్నికలు ఉండబోతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ దూకుడు పెంచటంతో కారుకు బ్రేకులు పడినట్టుగానే కమలం నేతలు భావిస్తున్నారు. భాజపాది కేవలం వాపు మాత్రమే అని.. బలుపుగా భ్రమిస్తున్నారంటూ టీఆర్ ఎస్ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. ఎవరు నెగ్గుతారు.. ఇంకెవరు కిందపడతారనేది తెలియాలంటే డిసెంబరు 4 వరకూ ఆగాల్సిందే.



