36 కిలోమీటర్లు.. 25 నిమిషాలు హ్యాట్సాప్ హైదరాబాద్ పోలీస్!
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ భారతంలోనూ హైదరాబాద్ పోలీసుకు ప్రత్యేక స్థానం ఉంది. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ. బందోబస్తు.. గస్తీ ఇవన్నీ కాదని.. ట్రాఫిక్ నియంత్రణతో మహానగరాన్ని గొప్పగా మలచటంలో ఖాకీల పాత్ర కీలకం. అటువంటి పోలీసులు ఈ రోజు మరో గొప్పఘనత చాటుకున్నారు. గ్రీన్‌ఛానల్ ద్వారా ప్రాణాపాయంలో ఉన్న రోగులకు అవయవాలను చేరవేసేందుకు తోడ్పాటును అందించారు. కిమ్స్ ఆసుపత్రి బేగంపేటలోని రోగులకు అవసరమైన కిడ్నీ, లివర్ ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయం వచ్చాయి. వాటిని కిమ్స్ ఆసుపత్రికి చేర్చేందుకు అంటే.. సుమారు 36 కిలోమీటర్ల దూరం వరకూ ట్రాఫిక్‌ను క్లియర్‌గా ఉంచి.. గ్రీన్‌ఛానల్ ద్వారా కేవలం 25 నిమిషాల్లో కిమ్స్ ఆసుపత్రికి చేర్చారు. సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయం.. పోలీసు కమిషనర్లు. సజ్జనార్, అంజనీకుమార్ పర్యవేక్షణతో కేవలం కొద్ది సమయంలోనే అవయవాలను ఆసుపత్రికి తరలించి.. మూడు ప్రాణాలను కాపాడగలిగారు. ఇప్పటి వరకూ అంటే 2020 సంవత్సరం.. కరోనా విధులు నిర్వర్తిస్తూనే.. 9 సార్లు.. గ్రీన్‌ఛానల్ ద్వారా ముంబై, పుణె, చెన్నై తదితర నగరాల నుంచి వచ్చిన అవయవాలను ఆయా ఆసుపత్రులకు సకాలంలో చేరవేయటంలో పోలీసులు కీలకపాత్ర పోషించి.. శభాష్ అనిపించుకున్నారు. పోలీస్ అంటే.. హైదరాబాద్ పోలీస్ స్పూర్తి అనేంత ఆదర్శంగా నిలిచారనటంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు.