గుంటూరు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ మరియు కీర్తన ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్ లకు సంబంధించిన వాల్ పోస్టర్ లను జిల్లాకలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆవిష్కరించారు. శనివారం ఆయన స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కోవిడ్-19 అవగాహన కార్యక్రమంలో షార్ట్ ఫిల్మ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రధానంగా మూడు ఆంశాలపై ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మాస్కులు, శానిటైజర్ వినియోగం, భౌతికదూరం పాటింపుతో కోవిడ్-19 నుంచి రక్షణ అనేది ఒక నిముషం నిడివితో మొదటి అంశంపై షార్ట్ ఫిల్మ్ తీయాలన్నారు. అదేవిధంగా స్వచ్ఛ గుంటూరు అనే అంశాన్ని మూడు నుంచి ఐదు నిముషాల నిడివితో ఉండాలన్నారు. ఇక, మూడో అంశంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై అవగాహన చేస్తూ మూడు నుంచి ఐదు నిముషాల నిడివితో చిత్రీకరించి పోటీలకు పంపాలన్నారు.
ఒక్కో అంశానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు అర్హత సాధించిన షార్ట్ ఫిల్మ్ లను ఎంపికజేస్తామని జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ కుమార్ వివరించారు. మూడు అంశాలపై మొత్తం తొమ్మిది బహుమతులు అందజేస్తామన్నారు. ప్రథమ బహుమతి కింద రూ.10,000/- నగదు, ద్వితీయ బహుమతికి రూ.7,500/- నగదు, తృతీయ బహుమతికి రూ.5,000 నగదు అందిస్తున్నట్లు చెప్పారు. విజేతలుగా ఎంపికైన షార్ట్ ఫిల్మ్ ల నిర్వాహకులకు నగదు బహుమతితో పాటు ప్రభుత్వ ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేస్తామన్నారు. ఒక నిముషం నిడివితో ఎంపికయ్యే కోవిడ్-19 రక్షణ షార్ట్ ఫిల్మ్ లను సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తామని వెల్లడించారు. షార్ట్ ఫిల్మ్ ల పోటీల నిర్వహణకు స్వచ్ఛంధంగా ముందుకొచ్చిన కీర్తన ట్రస్టు అధినేత మేరిగ విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఎంట్రీ ఫీజు ఉచితమని… ఎంట్రీ వీడియోలు పంపడానికి అక్టోబర్ 20వ తేది ఆఖరుగా నిర్ణయించినట్లు వివరించారు. పూర్తిచేసి పోటీలకు పంపాల్సిన షార్ట్ ఫిల్మ్ వీడియోలను గూగుల్ డ్రైవ్ లో అప్ లోడ్ చేసి..ఆ లింకును keerthanatrustgnt@gmail.comకి మెయిల్ పెట్టాలన్నారు. వివరాలకు 9381243599, 9985566444, _8801928670లలో సంప్రదించాలన్నారు. రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్ ల పోటీల వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గుంటూరు జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, మెప్మా పీడి సావిత్రి, గుంటూరు మున్సిపల్ కమిషనర్ సి.అనురాధ, సినీ, రంగస్థల దర్శకులు చెరుకూరు సాంబశివరావు, షార్ట్ ఫిల్మ్ పోటీల కో ఆర్డినేటర్ పొగర్తి నాగేశ్వరరావు ఉన్నారు.




