ఔను… నా దేశానికి ప్రాణవాయువు కావాలి. రేపటి ప్రపంచానికి దిశానిర్దేశం చేసే నా భరతమాత తల్లడిల్లిపోతుంది. 200 ఏళ్లపాటు తెల్లదొరల కబంధ హస్తాల చాటున ఉక్కిరిబిక్కిరైనపుడు కూడా ఇంత బాధపడలేదు. స్వేచ్ఛావాయువులు పీల్చుకునే స్వతంత్ర భారతంలో పాలకుల తప్పిదాలు.. కరోనా వైరస్‌ను మించి వెంటాడుతున్నాయి. అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. 2019 లో చైనా విసిరిన బయోబాంబు కరోనా రూపంలో ప్రపంచాన్ని కకావికలం చేసింది. 2020 మొదటిద శలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. లాక్‌డౌన్‌తో ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని తెలిసినా ధైర్యంగా లాక్‌డౌన్ విధించారు. కోట్లాదిమంది ప్రాణాలు కాపాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మైత్రి కూడా వికసించింది. 2021 రెండో దశ కరోనా ముందుగానే ఊహించలేకపోయారు. అప్పటికే మూడో వేవ్ కరోనాతో అల్లాడిపోతున్న అగ్రదేశాల ను చూసి కూడా పాలకులు గుణపాఠాలు నేర్వలేకపోయారు. ప్రజలు కూడా ఇష్టానుసారం రోడ్లమీదకు వచ్చారు. మాస్క్ పెట్టమని అడిగితే ఇదేనా ప్రజాస్వామ్యమంటూ ఎదురుదాడులు. బౌతికదూరం పాటించమంటే.. అబ్బే మాకు తెలియదా! అంటూ వెటకారాలు. వెరసి.. జనం నిర్లక్ష్యం రెండోవేవ్‌లో భారత్‌లో మారణహోమాలకు కారణమైంది. యూపీ, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఇలా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మోజులో పడి కరోనాను గాలికోదిలేశారు. జనం కూడా నేతల వెంట పరుగులు తీశారు. అంతే.. ఇప్పుడు దాని ఫలితం కళ్లారా చూస్తున్నా.. వీధికో మరణాన్ని జర్ణించుకోలేకపోతున్నాయి.
కళ్లెదుట ఊపిరి అందక.. తండ్రి కిందపడి కొట్టుమిట్టాడుతుంటే.. తట్టుకోలేని కూతురు… తండ్రి గొంతులో నీళ్లు పోసి బతికించుకోవాలని తపించటాన్ని కళ్లారా చూశాం. భర్తను బతికించుకునేందుకు భార్య నోటితో ఊపిరి పోయాలని చూసిన దృశ్యాలు ఒకటా రెండా.. అంబులెన్స్‌లో ఉంచి ప్రాణాలు నిలపాలని తపించే బిడ్డలు. కన్నవారి బాధను కళ్లారా చూడలేక విల్లవిల్లాడి హృదయాలు. కన్నబిడ్డలు కళ్లెదుట కనుమూస్తుంటే.. ఊపిరాడట్లేదంటూ వేడుకుంటున్న ఎన్నో వేదనా భరితమైన దృశ్యాలకు కారణం.. ఆక్సిజన్. ఆరోగ్యకరమైన వ్యక్తి రక్తంలో 96-100 వరకూ ఆక్సిజన్ స్థాయిలు ఉండాలి. కరోనా సోకిన తరువాత దాని ప్రభావం శ్వాసపై ఎక్కువగా పడుతుంది. ఇంత దాకా ఎందుకు వస్తున్నారంటే.. దానికి చాలా కారణాలున్నాయి. 24 గంటల్లో మరణించిన వారు 3,780 నమ్మగలరా.. ఇదంతా ఊపిరాడక.. ఆక్సిజన్ లేక మరణించినవారే ఎక్కువ. భారత్‌లో కేసుల తీవ్రత గుబులు పుట్టిస్తుంది. మహారాష్ట్రలో ఎక్కువ కేసులున్నాయి. లాక్‌డౌన్ అనేది కూడా అక్కడే మొదలైంది. 63,309 కేసులున్నాయి. 965 మంది 24 గంటల్లో ఇక్కడ మరణించారు. 6,41,941 కేసులున్నాయి. కర్ణాటకలో 288 మంది మరణించారు. ఒడిషాలో 24 గంటల్లో 15 మంది, తమిళనాడులో 144 మంది మరణించారు. దిల్లీలో 338 మంది కనుమూశారు.
వైరస్ రూపం మార్చుకున్న క్రమంలో ప్రస్తుతం 80శాతం మందికి ఎటువంటి లక్షణాలు ఉండట్లేదు. దీంతో తాము ఆరోగ్యంగా ఉన్నామనే భరోసాతో స్వేచ్ఛగా.. మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్నారు. దీని ఫలితంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్లకు వైరస్ అంటిస్తున్నారు. పరీక్షల నివేదికలు కూడా 5-6 రోజులకు రావటంతో ఆప్పటికే ఊపిరితిత్తుల్లోకి చేరిన వైరస్ ఊపిరి ని నిర్బంధిస్తుంది. అకస్మాత్తుగా ఆక్సిజన్ స్థాయిలు 80కు పడిపోవటం.. శ్వాస అందక బాధపడటం.. అదనుగా.. ప్రయివేటు ఆసుపత్రులు ప్రాణ భయాన్ని బూచిగా చూపుతు భయపెడుతున్నాయి. ఒక్కసారి ప్రయివేటు ఆసుపత్రికి చేరితే.. కనీసం 5 లక్షల నుంచి 15 లక్షల వరకూ వదలాల్సిందే అనే పరిస్థితికి చేరింది. ఏడాది పాటు ఈగలు తోలుకున్న చాలా ఆసుపత్రులు కొవిడ్ కేంద్రాలుగా మారి వైద్యం అందిస్తున్నాయి. ఇక్కడ కేవలం నగదు మాత్రమే తీసుకుంటారు. డిజిటల్ లావాదేవీలు అంటే తూచ్.. మరో ఆసుపత్రి చూసుకోమంటున్నారు. ప్రస్తుతం 2 కోట్ల మంది దేశంలో వైరస్‌కు గురయ్యారు. మే 15 నాటికి పరిస్థితి భయంకరంగా మారుతుందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.