అగస్టు 29 వ తేదీ .. గాల్వాన్ లోయలో చైనా ఆర్మీ రహదారి నిర్మాణం చేస్తుంది. నిఘాపరికరాలను అమర్చుతూ భారత్‌పై పై చేయి సాధించేందుకు కుయుక్తులు పన్నుతుంది. అదను చూసి ఇండియన్ ఆర్మీపై మరోసారి దాడి చేయాలని నక్కజిత్తులతో కాచుకు కూర్చుంది. కానీ..వారి ఆశలు వమ్ము చేస్తూ.. అగస్టు 31వ తేదీ అర్ధరాత్రి అకస్మాత్తుగా గొరిల్లా దళం వారిపై విరుచుకుపడింది. రెప్పపాటులో ఏం జరుగుతుందని అర్ధంచేసుకునేలోపుగానే ఆ దళం పని పూర్తికానిచ్చింది. అక్కడ చైనా నిర్మాణాలను కూల్చివేసింది. ఒక్క దెబ్బకు ఆక్రమించుకున్న స్థలాన్ని విడచి బతుకుజీవుడా అంటూ చీనీ సైనికులు కాళ్లకు బుద్దిచెప్పాల్సి వచ్చింది.. ఇదంతా కేవలం రెండు గంటల్లోనే పూర్తిచేశారు. ఆ గొరిల్లా దళం అసలు పేరు స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్సెస్ (ఎస్.ఎఫ్.ఎఫ్) . మొదటిసారి ఈ గొరిల్లా దళం ఆపరేషన్ ఈగల్ చిట్టగాంగ్ పర్వతాల్లో 1971లో బంగ్లాదేశ్ వార్‌లో పాల్గొంది. శత్రువుల వెన్నులో వణకు పుట్టించింది. ఆ తరువాత పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో నక్కిన ఉగ్రవాదుల కోసం 1984లో ఆపరేషన్ బ్లూస్టార్. 1984లో సియాసిన్‌లో ఆపరేషన్ మేఘదూత్, 1999లో పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ విజయ్ పేరుతో భారతసైన్యం జరిపిన ప్రతిదాడిలో ఎస్ ఎఫ్ ఎఫ్ పోర్స్ కీలక భూమిక. ఇండో-టిబెటియన్ కుర్రాళ్లు ఉండే గొరిల్లా దళం జరిపే ఆపరేషన్స్ అన్నీ చాలా రహస్యంగా జరుగుతాయి. ఇండియన్ నిఘా సంస్థ రీసెర్స్ అనాలసిస్ వింగ్(రా) సారథ్యంలోనే వీరికి శిక్షణ, ఆపరేషన్ కార్యకలాపాలు అప్పగిస్తారు. వీరు డైరెక్ట్ గా పీఎంఓ కార్యాలయంతో అనుసంధానమై ఉంటారు. ఇప్పటికే గాల్వాన్‌లోయ, హిమాచల్ ప్రదేశ్‌లో భారత ఆర్మీ లక్షలాది మంది సైనికులను తరలించింది. టీ -72, టీ-90 యుద్ధట్యాంకులు, రఫెల్ యుద్ధవిమానాలు, క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసింది. యుద్ధబేరి మోగితే.. కదనరంగంలో దూసుకెళ్లేందుకు సైనికులు ఆదేశం కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి ఇది చైనా ఊహించలేకపోయింది. తన బెదిరింపులకు భయపడి కాళ్లబేరానికి వస్తుందని ఊహించింది. కానీ దక్షిణ చైనా సముద్రంలోయుద్ధనౌకలు మోహరింపు. చైనా సరిహద్దుల్లో యుద్ధ విమానాలను కూల్చివేసే ఇగ్లా మిస్సైల్స్‌ను భారత్ సిద్ధం చేసిందని తెలియగానే గాల్లోకి ఎగిరిన చైనా యుద్ధవిమానాలు వెనుతిరిగాయి. మరోవైపు ఎంతో కీలకమైన హిమాచల్‌ప్రదేశ్-లడ్డాఖ్ కు 260 కిలోమీటర్ల రహదారి నిర్మాణం దాదాపు పూర్తికావస్తుంది. ఇక్కడ నుంచి సైనికులను బోర్డర్‌కు తరలించటం చాలా ఈజీ. పైగా శత్రువులకు మన కదలికలు కూడా తెలియవని ఆర్మీవర్గాలు చెబుతున్నాయి. ఫాంగాంగ్ వైపు మరోసారి కన్నెత్తి చూసే ధైర్యం కూడా చైనా లిబరేషన్ ఆర్మీ చేయకపోవచ్చనేంత ధీమాగా అక్కడ భారత సైన్యం ఉంది.
మాతృమూర్తిని ఆరాధించే ప్రతి భారతీయుడిలో మాతృభూమి పట్ల అదే గౌరవం. అంగుళం నేల పరాయి సొంతమైనా తాడోపేడో తేల్చుకునేందుకు పిడికిలి బిగిస్తాడు. ప్రపంచమంతా చేతులెత్తి నమస్కరించే పుణ్యభూమి మనది. విశ్వమానవుడుగా భారతీయత చాటుకునే భారత్ ఇప్పుడు అంతర్జాతీయంగా మరో సత్తా చాటుకుంది. ప్రపంచ ఆధిపత్యం కోసం ఉచ్చనీచాలు మరచిన చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. యుద్ధానికి సై అంటూ చీనీయులు చేస్తున్న తాటాకుచప్పుళ్లకు భయపడేందుకు మేం పాకిస్తానీయులం కాదు.. భరత సింహాలమంటూ రొమ్మువిరిచి తుపాకీ చేతబట్టి..మంచుకొండల్లో ఇండియన్ సైనికులు చేస్తున్న నినాదాలు. చైనీయుల గుండెల్లో శతఘ్నులు పేల్చినంత భయాన్నిపుట్టిస్తున్నాయి. మీరు ఒక్క వ్యూహరచన చేస్తే.. మేం వంద ప్రతివ్యూహాలతో రెఢీగా ఉన్నామంటూ ఇండియన్ ఆర్మీ చీఫ్ ముకుంద్ నార్వాణే హెచ్చరించారు.