నేను ఎన్నో సార్లు ఈ వాగు దాటి అటు పక్కన ఉన్న ఊర్లకు వెళ్ళాను, కానీ అది ఎలక్షన్స్ ముందు, నేను గెలిచిన తర్వాత ఇదే మొదటి సారి అక్కడికి వెళ్లాను వాళ్లకు నన్ను మన్నించమని కోరి, వాళ్లకి నిత్యావసర సరుకులు ఇచ్చాను, కరోనా వ్యాధి గురించి వివరించాను ఎలా జాగ్రత్తలు పాటించాలో చెప్పాను, వాళ్ల నాపై ఎలక్షన్స్ ముందు చూపించిన ప్రేమ, అంతే ప్రేమ ఇప్పుడు కూడా చూపించు, మీరు చూపించిన ప్రేమ, మమకారం మరువలేనిది మీకు రుణపడి ఉంటానని మాట ఇచ్చాను. ఇలా ఎంతమంది ధైర్యంగా చెప్పగల ఎమ్మెల్యేలు, ఎంపీలున్నారంటారు. కానీ.. నేనున్నానంటూ తప్పును.. ఒప్పును ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్న ఏకైక శాసనసభ్యురాలు శీతక్క. ములుగు శాసనసభ్యురాలుగా నియోజకవర్గ స్థాయిలోనే కాదు.. తనదైన వ్యక్తిత్వంతో తెలుగునాట పాటగా పల్లవిస్తున్నారు. స్పూర్తిని పంచుతున్నారు. ఆమెలోని అంతటి గొప్పతనమే.. కాంగ్రెస్ హైకమాండ్‌ను కదిలించింది. రాహుల్‌గాంధీ స్వయంగా సీతక్కలాంటి హార్డ్ వర్కర్ పార్టీకు. దేశానికి ఎంతఅవసరమనేలా మాట్లాడించింది.
నవ్వుతూ మాట్లాడే శీతక్కకు సమాజం కోసం గొంతెత్తి గర్జించగల సత్తా దాగుంది. సైలెంట్ అనుకునే వారిలో ఆమెలో దాగిన బడబాగ్ని గుర్తుచేయగలదు. శాంతస్వరూపం అనుకుని అలుసుగా తీసుకుంటే.. శివంగిలా మారి చుక్కలు చూపగల సామర్థ్యం ఆమె సొంతం. ఇంత గొప్పతనం ఉన్న శీతక్క అసలు పేరు దనసరి అనసూయ. దళంలోకి చేరిన తరువాత శీతక్కగా మారారు. అడవిలో పుట్టి పెరిగిన ఆమెకు ప్రకృతితో స్నేహం చేయటం ఇష్టం. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించటమూ తెలుసు. ఉద్యమనేత బాలగోపాల్ స్పూర్తితో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. కానీ అంతకు ముందు.. అడవిచుక్కగా లక్షలాది మంది గిరిజనులకు అమ్మగా.. అక్కగా సేవలు అందించారు. పీపుల్స్‌వార్ గ్రూపు కమాండర్‌గా తన దళాన్ని అద్భుతంగా నడిపించారనే పేరుంది. భద్రాచలం, కొత్తగూడెం, ములుగు ప్రాంతాల్లో.. గోదావరి నదీ తీరంలో శీతక్క అంటే అక్రమార్కులకు హడల్. పేదగుండెలకు గంపెడు ఓదార్పుగా మారారు.
పాఠశాలలో చదువుకునేటపుడే.. అంటే 1986-87 సమయంలోనే గోదావరి వరదలతో జనం అల్లాడుతున్న సమయంలోనే శీతక్క స్పందించారు. ఊరూవాడా తిరుగుతూ రూ.13000 సేకరించి అన్నపానీయాలకు ఉపయోగించారు. పాఠశాల వయసులోనే అంతటి సేవా నిరతి ఉన్న ఆమెలో శివంగి కూడా దాగుంది. హాస్టల్స్‌లో పురుగుల అన్నం పెట్టినపుడు.. తోటి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైనపుడు గట్టిగానే పోరాడారు. న్యాయపరంగా పౌరులకు దక్కాల్సిన హక్కుల సాధనకు అనసూయ శీతక్కగా మారింది. అప్పటికే ఆమె బావ రామ్ దళంలో ఉండటంతో అనసూయ అలియాస్ శీతక్కగా మారారు. డబుల్‌బ్యారెల్ గన్ నుంచి ఎస్ ఎల్ ఆర్ వరకూ అన్ని ఆయుధాలను సునాయాసంగా వాడగలరామె.
గిరిజన మహిళలకు ఏ కష్టం వచ్చినా శీతక్క ఉందనే ధైర్యం. అదే అందరికీ ఆమెను మరింత దగ్గర చేసింది. మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా అంతే సంగతులు. చాలా మంది ప్రబుద్ధులకు గుండు గీయించారు. అత్యాచారాలకు పాల్పడుతున్న ఒక మృగాడుకు ఏకంగా ప్రయివేటు పార్ట్‌ను కత్తిరించారట. అది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
చానాళ్లు.. ఆడవాళ్ల వైపు చూడాలంటే అమ్మో శీతక్క ఉందనే భయం వెంటాడేలా చేసింది. ఆ తరువాత ఉద్యమం నుంచ బయటకు వచ్చి శీతక్క.. టీడీపీలో చేరారు. పేదలకు న్యాయ సాయం చేయాలనే సంకల్పంతో లా విద్యను పూర్తిచేశారు. శీతక్క వద్దకెళితే రక్షణ దొరుకుతుందనేంతగా చేరువయ్యారు . ములుగు నుంచి 2018 ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎదిగారు.
నాకు అడవి అంటే ఇష్టం, అడవిలో నడవడం అంటే ఇష్టం, కానీ ఈ కష్టకాలంలో నాతో పాటు అడుగులో అడుగై నడుస్తున్న నా అన్నలకి తమ్ముళ్ళకి, మరియు సోషల్ మీడియా ద్వారా నాకు మద్దతు పలుకుతున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, అక్కడ మీరు నాలుగు గోడల మధ్య ఉంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీ పక్క వాళ్ళని కూడా కాపాడండి, మేము ఇక్కడ అడవిలో ఉంటూ పేద ప్రజల్ని ఆదుకుంటాం, మీ ప్రోత్సాహం మరువలేనిది ఎల్లపుడు మీకు తోడుగా మరియు అందుబాటులో ఉంటానంటూ సీతమ్మ నడచిన అడవిలో శీతక్క.. తన వారి ఆకలి తీర్చేందుకు ముందుకు కదిలారు. కరోనా విస్తరిస్తున్న వేళ తాను ఎన్నికల ముందు ఓట్ల కోసం తిరిగిన పల్లెలన్నీ చుట్టొచ్చారు. వాహనం వెళ్లలేని చోటికి కాలినడకన ప్రయాణించారు. గిరిబిడ్డలు పస్తులతో ఉండకూడదనే గొప్ప ఆలోచనతో భోజనపదార్థాలు స్వయంగా నెత్తిన పెట్టుకుని మరీ తీసుకెళ్లారు. శీతక్క.. ఆ భద్రాద్రిలో కొలువైన శీతమ్మ అనే భావన కలిగించారు. అడవిలో తిరగటం ఆమెకు కొత్తేం కాదు ఆనాడు తుపాకీపట్టి తిరిగిన అవే చేతులు.. కరోనా సమయంలో ఆకలి తీర్చేందుకు మెతుకులు పట్టుకున్నాయంటూ గర్వంగా చెబుతారామె. లక్షలు చేతులో ఉన్నా తినేందుకు ఏమీ దొరకని రోజులనూ చూశారు. ఇప్పుడు కళ్లెదుట అన్నీ ఉన్నా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిని చవిచూశానంటారు. పేదింట పుట్టిన తనకు సమాజం.. వీలైనంత వరకూ సేవ చేయటంలోనే తృప్తి దొరుకు తుందంటారు. తప్పు జరిగినపుడు తన.. పర బేధాల్లేకుండా ఎవర్నైనా నిలదీస్తాననే ఆమె మనోధైర్యం.. నిజంగానే ఇప్పటి చాలామంది నేతలకు ఆదర్శం. ఎన్నికల సమయంలో నోట్లు కుమ్మరించి ఐదేళ్ల వరకూ పల్లెల వైపు కన్నెత్తి చూడని ఎంతోమంది తిండిపోతు ప్రజాప్రతినిధులకు ఆమె జీవితం పాఠం.