సీఎం హోదాలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ సమర్పిస్తారా! ఎందుకు సమర్పించాలంటారు మంత్రివర్యులు కొడాలి నాని. అయినా అప్పుడు సోనియాగాంధీ వచ్చినపుడు లేని వివాదం ఇప్పుడెందుకు.. అప్పుడు బీజేపీ, చంద్రబాబు గాడిదలు కాశారా అంటారు ది గ్రేట్ ఎమ్మెల్యే రోజా సెల్వమణి. నిజమే.. ఏ నాయకుడినీ అడగని ప్రశ్న జగన్ వద్దనే ఎందుకు ఎదురవుతుందనే వారి ప్రశ్నలోనూ న్యాయం ఉంది. కొడాలి నాని అన్నట్టుగా.. ఆయన ఆరు కోట్ల మంది తరపున ప్రతినిధి కాబట్టే సంతకం అనే హక్కు ఎవరికీ లేదంటారు. పోనీ.. ఇతర మత మందిరాల్లోకి వెళ్లినపుడు కూడా ఇదే వాదన చేస్తారా! అంటే మౌనమే సమాధానం. నిజమే.. ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆ నాడు టీడీపీ ఏ దారిన నడిచిందో.. ఇప్పుడు వైసీపీ కూడా అదే మార్గంలో నడుస్తుంది. సీఎం హోదాలో జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయంపై మంత్రులు అతిగా జోక్యం చేసుకోవటమే వివాదానికి ప్రధాన కారణం.మీడియా కూడా గుచ్చిగుచ్చి ఘర్షణ పెంచేలా ప్రశ్నలు సంధించటం.. నేతలను ఎమోషన్ చేసి నోరు జారేలా చేయటం కూడా గొడవలను మరింత పెంచుతుందనే విమర్శలూ లేకపోలేదు. మీడియా అడిగినంత మాత్రాన.. తామేం మాట్లాడుతున్నామో తెలియనంత పరిణితి లేని నాయకులా మనల్ని పాలిస్తుందనే అనుమానాలు కూడా లేకపోలేదు.
కొడాలి నాని.. ఏదీ దాచుకోడు. అందుకే.. తన వ్యక్తిగతమంటూ అన్నీ కక్కేశాడు. దీనిపై జగన్ మౌనంగా ఉంటే.. పరిస్థితి మున్ముందు మరింత సీరియస్‌గా మారే ప్రమాదం ఉందంటూ పరిపూర్ణంద స్వామి హెచ్చరించారు. మంత్రిగా కొడాలి తన వ్యక్తిగతం అనేందుకు అవకాశం లేదు. ఎందుకంటే.. ఒక్కసారి పబ్లిక్ లోకి వచ్చాక.. తూచ్ ఇదంతా నా పర్సనల్ అంటే ఎలా! అనే ప్రశ్న కూడా వస్తుంది. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఏలికగా అందర్నీ సమదృష్టితోనే చూస్తారనుకుందాం! కానీ ఇతర మతాల మందిరాలపై దాడులు జరిగినపుడు వెంటనే అరెస్టులు చేయించిన ఏలికకు.. ఇప్పుడు హిందు దేవాలయాలపై దాడులు జరిగితే వారంతా పిచ్చివాళ్లని.. మద్యం మత్తులో చేశారంటూ ఘటన వెనుక శక్తులను తప్పించటంపై కూడా హిందుసంఘాలు మండిపడుతున్నాయి.
వరుసగా హిందు దేవాలయాలపై దాడుల నేపథ్యంలో సీఎం తీరుపై హిందువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే… తిరుమల ఉత్సవాలకు వెళ్తున్న ఆయన క్రైస్తవుడుగా డిక్లరేషన్ ఇవ్వాలనే ప్రశ్న మొదలైంది. కానీ.. తాను ఏనాడో హిందువుగా మారానంటూ జగన్ మోహన్‌రెడ్డి మీడియా ఎదుటకు వచ్చి సమాధానం చెబితే.. విమర్శకుల నోటిలో వెలక్కాయపడినట్టే. జగన్ మోహన్‌రెడ్డి ఇప్పటికే తిరుపతి చేరారు. తిరుమలలో ఆయనకు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అంతకు ముందే.. హడావుడిగా అక్కడకు చేరిన మంత్రి కొడాలి.. మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు. నరేంద్రమోదీ కూడా భార్యతో కలసి దేవాలయాలకు వెళ్తున్నారా! అంటూ వివాదాస్పదంగా స్పందించారు. దీనిపై బీజేపీ భజరంగ్‌దళ్ హైదరాబాద్, తిరుపతి, కృష్ణాజిల్లాల్లోనూ ధర్నాలు చేపట్టాయి. కొడాలి దిష్ఠిబొమ్మను తగులబెట్టాయి. ఇన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెడితే అందరి నోళ్లు మూతపడతాయి. నేనెందుకు సంతకం పెట్టాలని.. గతంలో మాదిరిగానే ఆయన దేవాలయంలోకి వెళితే ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలున్నాయనేది విశ్లేషకుల అంచనా.