ఆయన కావాలని అన్నాడో.. ఫ్లోలో వచ్చాయో తెలియదు కానీ.. మంత్రి కొడాలి కామెంట్స్ రాజకీయ దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నపుడు.. తిరుమలలో ఉన్న కొడాలి మంటలు రాజేశాడు. బ్రహ్మోత్సవాలకు వచ్చే జగన్ సతీసమేతంగా రావాలనే డిమాండ్ నేపథ్యంలో కొడాలి.. బీజేపీ నేతలపై మండిపడ్డారు. నరేంద్రమోదీ , యోగి ఆదిత్యనాథ్ కూడా భార్యలతోనే గుడులకు వెళ్లున్నారా! అంటూ ప్రశ్నించారు. ఓ వైపు భారతీయులు మెచ్చే నేత నరేంద్రమోదీ అంటూనే చురకలు వేశారు. ఇదంతా హిందుసంఘాలు, బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామిజీ అయితే.. యోగీ, మోదీలు సన్యాసులని.. పెళ్లాం ఉన్న ఒంటరిగా పూజాకార్యక్రమాలకు హాజరయేవారిని సన్నాసులు అంటారంటూ ఘాటుగానే స్పందించారు. వాస్తవానికి కొడాలి నాని హిందు సంప్రదాయాలపై ఎందుకిలా రెచ్చిపోయారనే ప్రశ్నకు వైసీపీ శ్రేణుల్లోనూ సమాధానం కరవైంది. కొడాలి పట్ల హిందు సంఘాలు చేపట్టిన ఆందోళనపై ఇప్పటి వరకూ ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా స్పందించకపోవటం కొడాలి ఒంటరి అయ్యాడా! అనే అనుమానాలకు తావిస్తోంది.
జగన్ డిక్టరేషన్ విషయం.. వైవిసుబ్బారెడ్డి ఎందుకు తెరమీదకు తెచ్చారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. పొంతనలేని అంశాన్ని ఎందుకిలా అర్ధాంతరంగా రాజకీయం చేశారనేది కూడా అంతుబట్టిన ప్రశ్నే. వై.వి.సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా జగన్ ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. దీనికి పలుమార్లు ఆయన వివరణ ఇస్తూనే అసహనం వ్యక్తం చేస్తున్నారు. పృద్వీరాజ్ అనే సినీనటుడుని ఎస్వీబీసీ ఛైర్మన్ గిరీ పదవి నుంచి తప్పించేందుకు కూడా వైవి.సుబ్బారెడ్డి చక్రం తిప్పారనే ఆరోపణలూ అప్పట్లో చక్కర్లు కొట్టాయి. ఆ తరువాత తిరుమల ఆలయ భూముల విక్రయం.. అనంతరం తిరుమల లడ్డూల విక్రయం.. ప్రతి విషయంలోనూ వివాదాలు జగన్ సర్కార్‌ను ఇబ్బందికి గురిచేస్తున్నాయి.
ఇదిచాలదన్నట్టుగా. కొడాలి కూడా తిరుమల ప్రతిష్ఠపై హిందుమనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం మరింత ఆజ్యం పోసింది. అసలే సీబీఐ కేసులు వెంటాడున్నాయి. సుప్రీంకోర్టు కూడా కేసులున్న ప్రజాప్రతినిధులపై ఛార్జిషీట్లు తదితర అంశాలపై ఆదేశాలు జారీచేసింది. మరోవైపు గుంటూరు లాలాపేట ఠాణాపై దాడి చేసిన యువకులపై కేసులు కొట్టేస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోపై హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది. ముస్లిం యూత్ అంటూ.. లౌకికరాజ్యంలో ఇలా మతాలను ప్రస్తావించటం సరికాదంటూ హితవు పలికింది. పోలీసులపై దాడిని తేలికగా తీసుకుంటూ.. జీవో జారీచేయటం కేవలం మతపరమైన ఓట్ల కోసమేనంటూ చెప్పింది. ఇలా.. వరుస ఘటనలు.. హిందువులను చులకన చేస్తూ.. ఇతర మతాలకు ప్రాధాన్యతనిస్తున్నారనే అభిప్రాయం ఏపీ ప్రజల్లో బలపడుతోంది. సున్నితమైన అంశాల విషయంలో ఆచితూచి స్పందించాల్సిన మంత్రులు నోరుజారి.. చివరకు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం తెస్తున్నారు.. ఐదేళ్లు నిలవాల్సిన ప్రభుత్వానికి నూకలు చెల్లేందుకు తామే మార్గం చూపుతున్నారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.



