గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం మంత్రి కేటీఆర్ వ్యూహాలకు పదను పెడుతున్నారు. కేటీఆర్ 2016 ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో 100 డివిజన్లు గెలుస్తామంటూ… 99 గెలిచి చూపారు.2020లోనూ అదే ధీమాతో ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే దుబ్బాక ఓటమితో బీజేపీ మాంచి జోష్ మీద ఉంది. ఇదే ఊపు తో జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవాలని యోచిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో వరద బీభత్సంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చెరువులు తెగి కాలనీలు నీట మునిగాయి. బాధిత కుటుంబానికి రూ.10000 ఆర్ధిక సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.550 కోట్ల నిధులు కేటాయించింది. పంపిణీ సమయంలో భారీగా అవకతవకలు తలెత్తాయి. కొందరు అధికారులు, కార్పోరేటర్లు కలసి వాటాలు వేసుకుని పంచుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇది టీఆర్ ఎస్ సర్కారును ఇబ్బందుల్లోకి నెట్టేసింది. దీంతో ఈ సారి ఓటింగ్ తగ్గే అవకాశం ఉందనే ఆందోళన గులాబీ గూటిలో మొదలైంది. అందుకే.. తప్పిదాలను సరిదిద్ది గ్రేటర్‌లో రెండోసారి గెలుపు కోసం స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. దీపావళి పండుగ రోజు కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఆస్తిపన్ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో 13 లక్షల కుటుంబాలు నివసించే ఇళ్లకు ఆస్తిపన్ను రాయితీ వర్తించనుంది. ఏటా రూ.15వేలు ఆస్తిపన్నుగా చెల్లించే వారు సగం అంటే 50శాతం చెల్లిస్తే చాలన్నారు. రాష్ట్రంలో 31లక్షల కుటుంబాలుంటే.. జీహెచ్ఎంసీలోనే 13లక్షల కుటుంబాలున్నాయి. ఇకపోతే.. వరద బాధితులు అందరికీ నగదు సాయం అందించేందుకు మరో సాయం ప్రకటించారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు అదనంగా రూ.3000 వేతనం అదనంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మీ-సేవ కేంద్రాల్లో బాధిత కుటుంబాలకు అవకాశం కల్పించారు. మీ సేవలో కొత్త సాఫ్టువేర్ ఫిక్స్ చేశారు. సాయం అందని కుటుంబాలు తమ వివరాలతో అప్లికేషన్ చేసుకుంటే చాలు. రెండుమూడు రోజుల్లోనే వారికి డబ్బులు అందజేస్తారు. అధికారుల పరిశీలనలో వాస్తవాలను గుర్తించి వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు నగదు సాయం అందజేస్తారని కేటీఆర్ ప్రకటించారు. దేశచరిత్రలో తొలిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారన్నారు. మీసేవ కేంద్రాలకు చెల్లించాల్సిన రూ.20 కూడా అవసరమైతే ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరి వరకూ సమయం ఉందని వెల్లడించారు.