మా ఎన్నిక‌ల్లో లోక‌ల్ నాన్ లోక‌ల్ ర‌చ్చ‌… పెట్రోల్ పోసిన ఆర్జీవీ!

మా ఎన్నిక‌ల్లో ర‌చ్చ మామూలుగా లేదు. ప్ర‌కాశ్‌రాజ్ ప్రెస్‌మీట్‌లో లోక‌ల్ , నాన్‌లోక‌ల్ గురించి లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌కు కొంద‌రు సినీ ప్ర‌ముఖులు రంగంలోకి దిగారు. అస్సలు ప్ర‌కాశ్‌రాజ్ ఎవ‌రు.. అయినా.. అప్ప‌ట్లో అర‌వ‌గోల ప‌డ‌లేక క‌దా! చెన్నై నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌చ్చాం. తెలుగు సినిమాకు ఉనికి కోసం మేం యుద్ధం చేస్తుంటే ఇప్పుడు ఎవ‌రో క‌న్న‌డ న‌టుడుని తీసుకొచ్చి మా మీద‌కు రుద్దుతారా! అంటూ త్రిపుర‌నేని చిట్టిబాబు అన‌బ‌డే ఒక సినీ పెద్దాయ‌న టీవీ చ‌ర్చ‌ల్లో పెడ‌బొబ్బ‌లు పెట్టారు. తెలుగు వాడి ఆత్మాభిమానం తాక‌ట్టు పెడ‌తారా అంటూ తెగ ఫీల‌య్యారు. పైగా.. మంచు విష్ణు వంటి స‌మ‌ర్థుడు, ఆణిముత్యం ఉండ‌గా మ‌రొక‌రు ఎందుకన్నారు. సినిమా వాళ్ల‌కు ఏ క‌ష్ట‌మొచ్చినా మంచులా క‌రిగిపోయి.. భుజాన చేయేసి ఏం బ్ర‌ద‌ర్ అంటూ క‌ష్టం తీర్చే మంచు కుటుంబం ఉండ‌గా ఎందుకీ ప్ర‌కాశ్‌రాజ్‌లంటూ కోరారు.

మ‌రి ఇంత‌గా లోక‌ల్ అని గింజుకుంటున్న‌.. పెద్ద‌లారా! నిమ్మ‌కూరు నుంచి ఎన్టీఆర్‌, బుర్రిపాలెం నుంచి కృష్ణ‌, వెంట‌ర రాఘ‌వాపురం నుంచి ఏఎన్నార్ త‌మిళ‌నాడు వెళ్లి లోక‌ల్‌గా ఎలా ఎదిగారంటూ.. ది గ్రేట్ ద‌ర్శ‌క రాంగోపాల్ వ‌ర్మ కూడా ట్వీట్ల‌తో నిల‌దీశారు. ప్ర‌కాశ్‌రాజ్‌ను నాన్‌లోక‌ల్ అంటూ తెలుగు సిని వ‌ర్గంలో కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని ప్ర‌చారం చేస్తున్న స‌మ‌యంలో ఆర్జీవీ ట్వీట్ మ‌రింత హీటెక్కించింది. మెగా ఫ్యామిలీ అంటేనే మండిప‌డే ఆర్జీవీ నాగ‌బాబు స‌మ‌ర్థించిన ప్ర‌కాశ్‌రాజ్ గురించి స్పందించ‌టం చ‌ర్చ‌నీయాంశంగానే మారింది. ఏమైనా.. మా ఎన్నిక‌లు మామూలుగా ఉండ‌వ‌నేది మాత్రం అర్ధ‌మ‌వుతుంది. నిన్న‌టి ప్రెస్‌మీట్‌లో బండ్ల గ‌ణేశ్ మీడియా నుద్దేశించి మాట్లాడిన తీరు.. ఎల్లోమీడియాకు ఎక్క‌డో సెగ పెట్టిన‌ట్టుగా మారింద‌ట‌. దీంతో బండ్ల గ‌ణేశ్ మాట‌లు అడ్డం పెట్టుకుని చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఇదంతా ఎవ‌రి కోసం చేస్తున్నార‌నేది త‌మ‌కు తెలుసంటూ సినీ న‌టులు కూడా గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇస్తున్నారు. సెప్టెంబ‌రులో జ‌రిగే మా ఎన్నిక‌లు మాత్రం గ‌తానికి భిన్నంగా మారాయానేది వాస్త‌వం. రెండు వ‌ర్గాలుగా మారి.. ఎవ‌రికి వారే రాజ‌కీయాలు చేస్తున్నార‌నేది కూడా వాస్త‌వం. అయితే ఇదంతా రాజ‌కీయ, కులం రంగు పులుముకోవ‌టం ఎంత వ‌ర‌కూ దారితీస్తుంద‌నేది ఆందోళ‌న క‌లిగించే అంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here