ఏ.పి లో షార్ట్ ఫిల్మ్ విన్నర్స్ వీళ్ళే

మద్యం వలన జనజీవితంలో కలిగే సమస్యలను చిత్రీకరించడంలో యువత ఉత్సాహం చూపారని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. మద్యం దుష్ర్పభావాలు.. ఏపీలో దశలవారీ మద్యనిషేధం అమలు అంశంపై మద్యవిమోచన ప్రచార కమిటీ నిర్వహించిన జాతీయ స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీల్లో ఎంపికైన విజేతలను ఆయన ప్రకటించారు. సోమవారం స్థానిక హిందూఫార్మశి కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణరెడ్డితో పాటు షార్ట్ ఫిల్మ్ పోటీల జ్యూరీ సభ్యులు ప్రముఖ సినీ దర్శకులు వి.సాగర్, రంగస్థల నిపుణులు కె.శాంతారావు, సినీ, రంగస్థల దర్శకులు, రచయిత చెరుకూరు సాంబశివరావు మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్నాటక నుంచి ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలకు సుమారు 400కు పైచిలుకు ఎంట్రీలు వచ్చాయని లక్ష్మణరెడ్డి చెప్పారు.
నాణ్యత, విషయ పరిజ్ఞానం తదితర అంశాల కోణాల్లో ఉత్తమ లఘు చిత్రాలుగా 15 షార్ట్ ఫిల్మ్ లలో మొదటి బహుమతి కింద ఐదింటిని, రెండో బహుమతి కింద ఐదింటిని, మూడో బహుమతికి మరో ఐదింటిని ఎంపిక జేశారని వివరించారు. మొదటి బహుమతికి ఎంపికైన ఫిల్మ్ లకు ఒక్కోదానికి రూ.10 వేలు చొప్పున, రెండోబహుమతి ఫిల్మ్ లకు రూ.7,500చొప్పున, మూడో బహుమతికి ఎంపికైన ఫిల్మ్ లకు ఒక్కోదానికి రూ.5వేలు నగదు అందిస్తారని తెలిపారు. అదేవిధంగా ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచనకు రూ. 5వేలు చొప్పున అందజేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 02వ తేదీ మహాత్మాగాంధీ జయంతి రోజున గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరిగే కార్యక్రంలో విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. ఉప ముఖ్యమంత్రి, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి కె. నారాయణస్వామి, ఇతర మంత్రుల చేతులమీదుగా విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రసంశాపత్రం, జ్ఞాపిక అందజేయనున్నట్లు వివరించారు. ప్రముఖ సినీ దర్శకులు వి.సాగర్ మాట్లాడుతూ మద్యంపై ప్రజల్లో అవగాహన పెంచి సకాలంలో మద్యాన్ని జీవితాల నుంచి బహిష్కరించి భావితరాలకు చక్కటి భవిష్యత్తు అందించేందుకు ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ పనిచేయడం అభినందనీయమ న్నారు. విలేకరుల సమావేశంలో రంగస్థల నిపుణులు కె.శాంతారావు, సినీ, రంగస్థల దర్శకులు, రచయిత చెరుకూరు సాంబశివరావు ఉన్నారు.short film winne

విజేతల వివరాలు:
మొదటి బహుమతి కింద 1. వ్యసనం(కాకినాడ), 2. మత్తువదలరా ( విశాఖ), 3. ఉందిలే మంచికాలం ముందు ముందునా(శ్రీకాకుళం), 4. డ్రంక్ అండ్ డ్రైవ్ (తిరుపతి), 5. ఓ శ్రీనుగాడి కథ (గుంటూరు). రెండో బహుమతికి 1.నిర్లక్ష్యం (కాకినాడ), 2. బానిస (కర్నూలు), 3. ఒన్ ఛాయిస్ ఒన్ లైఫ్ (నాయుడుగూడెం, తూర్పు గోదావరి) 4. మద్యంపై యుద్ధం (శ్రీకాకుళం), 5. మద్యం అంతరం (బెంగుళూరు) మూడో బహుమతి కింద 1. స్పందన (తుళ్లూరు), మార్పు సాధ్యమే (విశాఖ), 3. వదిలేద్దాం (విశాఖ), 4.వేదన (విశాఖ), 5. మందు మానరా మిత్రమా ( రాఘవేంద్రపురం, ఈస్ట్ గోదావరి). ఉత్తమ నటిగా బండారు నాగరాణి (షారోన్ రాణి)(గోరంట్ల, గుంటూరు) , ఉత్తమ నటుడుగా ఎఫ్ ఎం బాబాయి(విశాఖ), ఉత్తమ దర్శకత్వం కె.జాన్(కాకినాడ) ఉత్తమ రచన వెంకటేష్ వేలూరి (తిరుపతి).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here