హైదరాబాద్, నవంబర్ 8, 2020: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ రోగుల్లో మరణానికి కారణమవుతున్న అనేక కారణాల్లో ఊబకాయం కూడా ప్రధానమైనది. భారతదేశంలో అధిక బరువు ఉండి, కరోనా సోకిన వ్యక్తులలో ఎక్కువ మంది దీనికి సంబంధించిన సమస్యల వల్ల మరణించారు.
34 ఏళ్ల వయసులోనే 125 కిలోల బరువున్న ఊబకాయుడైన ఓ వ్యక్తి ప్రాణాలను దేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న మెడికవర్ ఆసుపత్రిలోని నిపుణులు కాపాడారు. కొవిడ్ సోకిన తర్వాత అతడి ఆక్సిజన్ స్థాయి దారుణాతి దారుణంగా (కేవలం 52%కు) పడిపోయింది. అతడి ఊపిరితిత్తులపై కరోనా ప్రభావం పడటంతో, ఆసుపత్రికి తరలించేసరికే అతడి పరిస్థితి బాగా విషమంగా ఉంది.
ఇలాంటి రోగులకు చికిత్స అందించడంలో ఉన్న సంక్లిష్టతను గురించి మెడికవర్ ఆసుపత్రుల డైరెక్టర్, క్రిటికల్ కేర్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఘన్‌శ్యామ్ ఎం. జగత్కర్ మాట్లాడుతూ, “ఆ రోగిని తొలుత నాన్-ఇన్వేజివ్ వెంటిలేషన్ మీద పెట్టాం. కానీ, అతడి పరిస్థితి బాగా దిగజారిపోవడంతో ఐసీయూకు తరలించి పూర్తిస్థాయి వెంటిలేషన్‌పై పెట్టాల్సి వచ్చింది. అతడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రోన్ వెంటిలేషన్ (తిరగేసిన స్థితిలో వెంటిలేషన్) పెట్టాల్సి వచ్చింది. అధిక బరువు ఉన్నవారికి ఈ తరహా చికిత్స అందించడం చాలా సవాలుతో కూడుకున్నది. అంతేకాదు, రోగికి రెండు వారాల పాటు పలుమార్లు ఇలా ప్రోన్ వెంటిలేషన్ అందించాల్సి వచ్చింది. ప్రతి సెషన్ 18-20 గంటల పాటు ఉంది. ఆ సమయంలో అతడి బీపీ, పల్స్, ఇతర కీలక అంశాలను కూడా పరిశీలించుకుంటూ ఉండాల్సి వచ్చింది” అని వివరించారు.
ఆ రోగి ఆసుపత్రిలో దాదాపు 50 రోజుల పాటు ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఇంట్లోనూ ఆక్సిజన్ సపోర్ట్ కొనసాగించాం. అతడు సాధారణ స్థితికి వచ్చేందుకు దాదాపు 5-6 వారాల సమయం పట్టింది. ఆసుపత్రిలోని ఇంటెన్సివిస్టులు, పల్మనాలజిస్టులు, ఐసీయూ నర్సులు, ఫిజియోథెరపీ, న్యూట్రిషన్ విభాగాలన్నింటికి చెందిన వారి నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం, అపారమైన విశ్వాసం వల్లే సాధ్యమైంది. పెద్ద సంఖ్యలో వైద్యులు, నర్సులు వారాల తరబడి అతడిని కంటికి రెప్పలా కాపాడుతూ, ఆక్సిజన్ సరఫరా అవసరం లేకుండానే నడిపించే స్థాయికి తీసుకొచ్చారు.