మాజీ ప్రధానుల్లో ఏ కొద్దిమందో సాధించిన పేరు ప్రఖ్యాతులు పీవీ సొంతం. రాజకీయాలకు అతీతంగా ఆయన్ను ఆరాధించేవారు. కీలకమైన అంశాలను కూడా పీవీతో చర్చించాకే నిర్ణయం తీసుకునేవారు. అంతటి రాజకీయ ఉద్ధండుడుకి భారతరత్న ఇవ్వటాన్ని ఎంఐఎం ఒప్పుకోవట్లేదు. పీవీ నరసింహారావు.. వందేళ్ల జయంతిని తెలంగాణ సర్కారు సగర్వంగా నిర్వహిస్తోంది. భారీ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తారట. భారతరత్న ఇవ్వాలంటూ కేసీఆర్ మంత్రివర్గం తాజా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసింది. అసలే కాంగ్రెస్ అంటే మండిపడే.. కేసీఆర్ దోస్త్.. టీఆర్ ఎస్ మిత్రపార్టీ ఎంఐఎం మాత్రం దీన్ని వ్యతిరేకించింది. అసెంబ్లీ సమావేశాలకు రాబోమంటూ ప్రకటించారు. అయినా కేసీఆర్ మాత్రం.. తీర్మానం ప్రవేశపెట్టడం.. మంత్రిమండలి ఆమోదం అంతా క్షణాల్లో జరిగాయి. కాంగ్రెస్ ఏ నాడో మరచిపోయిన పీవీ నరసింహారావు ఇప్పటికైనా గుర్తుకురావటం సంతోషమే. కానీ.. ఇప్పుడే ఎందుకు కేసీఆర్ దీన్ని తెరమీదకు తెచ్చారనేందుకు ఆయనకు వందేళ్ల జయంతి అంటూ కారణం చెబుతున్నారు. కానీ.. రాజకీయంగా దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా లేకపోలేదనే చర్చలు జరుగుతున్నాయి. పీవీ నరసింహారావు అపార అనుభవం.. ఆయన విజ్ఞానగని.. రాజకీయచతురుడు అని ఇప్పుడు కొత్తగా చెప్పటం.. హాస్యాస్పదమే. గాంధీ కుటుంబాన్ని దిక్కరించినా.. ప్రధాని పీఠంపై కూర్చున్న గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన విధేయత.. ముక్కుసూటితనమే ఆయన్ను వెనక్కినెట్టేసింది. ముళ్లకిరీటం ధరించినా తనదైన వ్యక్తిత్వంతో గొప్ప సంస్కరణవాదిగా తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ.. ఆయన పీఎంగా ఉన్నపుడు బాబ్రీమసీదుకూల్చివేత జరగటం మచ్చగా మిగిలింది. ఇప్పుడు..పీవీకు భారతరత్న ఇవ్వాలని పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలు కోరుతున్నా.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వ్యతిరేకించటానికి కారణం కూడా ఇదే. కానీ. కేసీఆర్ లెక్కలు వేరు.. రేపటి రోజున జాతీయరాజకీయాల్లో రాణించేందుకు ఇవన్నీ మెట్లుగా ఉపయోగపడతాయనేది ముందుచూపు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేయలేని పని తాను సాధించాననే ప్రచారం తెలంగాణ ప్రజల్లో.. కాంగ్రెస్ వాదుల్లో గుర్తింపు తెస్తుందనే ఆలోచన. ఇవన్నీ పీవీ ఠీవీగా ప్రచార అస్త్రంగా కేసీఆర్ శిబిరంలో చేరాయనేది విశ్లేషకుల అంచనా.