దుబ్బాకలో లక్ష ఓట్ల మెజార్టీ అంటూ మంత్రి హరీష్‌రావు ధీమా. అబ్బే ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీ వైపు గాలి వీస్తోందనే కమలనాథుల భరోసా. కాంగ్రెస్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరనే ఆత్మవిశ్వాసం. దుబ్బాక ఉప ఎన్నికలు మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఎవరికి వారే తమదైన ఎత్తుగడలతో దూసుకెళ్లుతున్నారు. ముఖ్యంగా టీఆర్ ఎస్ ఇక్కడ గెలుపును సవాల్‌గా భావిస్తోంది. 2018 ఉప ఎన్నికల నాటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు రాష్ట్రంలో గులాబీకు ఎదురుగాలి వీస్తోంది. కానీ మీడియా గొంతు నొక్కేయటం వల్ల ఎవ్వరూ ధైర్యం చేయలేకపోతున్నారు. ప్రభుత్వ పథకాలు, సీఎం హామీలు అమలులో అత్తెసరు మార్కులు పడుతున్నాయి. మాటలు తప్ప చేతలు లేవనే విషయం యువతలో వ్యక్తమవుతోంది. ఈ సారి దుబ్బాకలో గెలుపోటములను నిర్ణయించేది యువత, మహిళా ఓటర్లు. కరోనా సమయం ఎవరు ఎంత వరకూ పోలింగ్ కేంద్రాల వరకూ వస్తారనేది కూడా పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు.
టీఆర్ ఎస్ దివంగత ఎమ్మెల్యే సోంపేట రామలింగారెడ్డి భార్య సుజాతను బరిలోకి దింపింది. మహిళా ఓటర్లు, సానుభూతి కలసి వస్తే గెలుపు నల్లేరుమీద నడకగా భావించి ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ తరపున రఘునందన్‌రావు రెండోసారి పోటీపడుతున్నారు. బీజేపీ పట్ల పెరిగిన సానుభూతి, రఘునందన్‌రావుకు ఉన్న ప్లస్‌పాయింట్లను నమ్ముకున్నారు. టీఆర్ ఎస్‌లో సీటు ఆశించి భంగపడిన చెరకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లోకి రావటం.. టికెట్ పొందటం జరిగాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు కీలకమైన నేత టీఆర్ ఎస్‌లోకి చేరాడు. కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాసరెడ్డి అనుచరులు, లోకల్ లీడర్లు బీజేపీలోకి చేరుతున్నారు. మూడు పార్టీల నుంచి అటు ఇటు జంపింగ్‌లు జరగటంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఎవరు ఏ పక్షాన ప్రచారం చేస్తారు. ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారనే టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో గత ఎమ్మెల్యే వ్యతిరేక ఓట్లు ఎవరికి పడతాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. మూడు పార్టీలను భయపెడుతున్నది ఒక్కటే చీలిక ఓట్లు ఎవరికి పడతాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీలో ఎవరు సొంతం చేసుకుంటారనేది మరో ప్రశ్న. ఇటువంటి క్లిష్టమైన సమయంలో హరీష్‌రావు అధికార పార్టీ తరపున అక్కడే మకాం వేశారు. కాంగ్రెస్, బీజేపీలపై దుమ్మెత్తిపోస్తూ దూసుకెళ్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు, ప్రతివ్యూహాలతో జిల్లాలో ఏ విధంగా రాజకీయం నడిపించారో ఇప్పుడూ అదే ఎత్తుగడలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తారనే ధీమా టీఆర్ ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఏమైనా ఉప ఎన్నిక టీఆర్ ఎస్‌కు మాత్రమే కాదు.. హరీష్‌రావు సత్తాకు సవాల్‌గా మారింది.