టీఆర్ ఎస్ అభ్యర్ధి ఓటమి సంగతి వింటే నవ్వే కాదు.. బాధ కూడా వేస్తుంది. ఎన్నికల ఫలితాల్లో చాలా విశేషాలు జరుగుతుంటాయి. కొన్ని ఒక్క పొరపాటు వల్ల జరిగితే.. మరికొన్ని ఏ తప్పూలేకుండానే పరాజయం పాల్జేస్తుంటాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డినగర్ డివిజన్‌లో 2016 లో ముద్దగౌని లక్ష్మిప్రసన్న టీఆర్ ఎస్ కార్పోరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆమె భర్త రామ్మోహన్‌గౌడ్ 2018లో ఎల్‌బీనగర్ అసెంబ్లీ సీటుకు తెరాస అభ్యర్థిగా పోటీ చేసి సుధీర్‌రెడ్డి చేతిలో ఓడారు. ఇప్పుడు అంటే తాజాగా జరిగి బల్దియా ఎన్నికల్లో బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ నుంచి మరోసారి టీఆర్ ఎస్ తరపున లక్ష్మిప్రసన్న పోటీకు నిలబడ్డారు. ఆమెకు అనుచరుడుగా ఉన్న లచ్చిరెడ్డి బీజేపీలోకి చేరి ఆమెతో పోటీకు నిలిచారు. ఇక్కడే అనుకోన విషయం జరిగింది. లక్ష్మిప్రసన్న కొడుకు రంజిత్‌గౌడ్ తో కూడా ఒక నామినేషన్ వేయించారు. విత్‌డ్రా చేయించకుండా పోలింగ్ రోజున ఏజెంట్‌గా ఉండేందుకు పనికొస్తాడనే ఉద్దేశంతో అలాగే ఉంచేశారు. దీంతో అతడికి కూడా ఎన్నికల సంఘం ఇండిపెండెంట్ అభ్యర్థిగా టార్చిలైట్ గుర్తు ఇచ్చింది. కానీ జనాలకేం తెలుసు.. అమ్మ కొడుకు ఇద్దరూ ఒక్కటే అనుకుని ఉంటారనుకుంటా.. తల్లితోపాటు.. కొడుకు కూడా కొన్ని ఓట్లేశారు. శుక్రవారం కౌంటింగ్‌లో గెలవాల్సిన లక్ష్మిప్రసన్న కేవలం 32 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి లచ్చిరెడ్డి ఎంచక్కా గెలిచాడు. అంతే.. తూచ్ ఇదంతా నాకు తెలియదంటూ వారంతా నిరసనకు దిగారు. దీంతో అసలు కొడుకు కేటాయించిన గుర్తుకు ఎన్ని ఓట్లు పడ్డాయా అని చూస్తే.. 39 ఓట్లు పోలయ్యాయని గుర్తించారు. అంటే.. అమ్మకు రావాల్సిన 32 ఓట్టు కూడా కొడుకు గుర్తుకు పోలవటంతో జరగరాని నష్టం జరిగింది. గెలవాల్సిన తల్లిని చేతులారా కొడుకే ఓడించినట్టుగా డివిజన్ లో చర్చించుకుంటున్నారు. అయినా అంతా అయ్యాక.. ఏం చేస్తామంటూ లక్ తప్పిందని కాస్త బాధపడ్డారట.