చిన్నపొరపాటు పెద్ద కష్టాలను కొనితెస్తుందంటే ఏమో అనుకున్నాం. కరోనా వైరస్ విస్తరించేందుకు అదే కారణమైందని తెలిశాక నోరెళ్ల బెట్టాం. పది నెలలుగా మహమ్మారి వెంటాడుతున్నా.. లక్షలాది మందిని బలితీసుకుంటున్నా.. ఇప్పటికీ జనాల్లో మార్పు రాలేదు. అదే నిర్లక్ష్యం.. అదే తీరు.. మాస్క్‌లు మరిచారు. శానిటేషన్ దూరం చేశారు. ఇవన్నీ చేతులారా వైరస్‌ను ఆహ్వానిస్తున్నట్టుగా ఎవ్వరూ గ్రహించట్లేదంటూ స్వయంగా సీసీఎంబీ డైరెక్టర్ మిశ్రా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. యూకేలో వెలుగుచూసిన కరోనా స్ట్రయిన్ చాలా ప్రమాదకరంగా ఉందంటూ హెచ్చరికలు. పిల్లలు, యువతలో ఎక్కువగా వ్యాపించటం మరింత భయాందోళనకు గురిచేస్తున్న అంశం. ఇటువంటి సమయంలోనే ఈ వైరస్ గురించి కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మొన్న యూకే నుంచి ఢిల్లీ విమానాశ్రయం వచ్చిన ఓ మహిళ రాజమండ్రి చేరింది. వైద్యపరీక్ష నివేదిక రావటం ఆలస్యమవటంతో ఆమె.. ఢిల్లీ నుంచి రైలుమార్గంలో రాజమండ్రి చేరింది. ఆమెతోపాటు.. కుమారుడు వచ్చారు. అంతేగాకుండా.. రైల్లో వేలాది మంది ప్రయాణికులు.. విమానంలో వందలాది మంది దేశీయులు.. వీరందరి పరిస్థితి ఏమిటనేది ఆందోళన కలిగిస్తోంది. ఆమెను గుర్తించిన వైద్య శాఖ ప్రస్తుతం ఆసుపత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. ఈమె ప్రయాణించిన వాహనాలు, కుమారుడు తిరిగిన ప్రాంతాలు.. కలసిన మనుషుల గురించి ఆరా తీస్తున్నారు. కరోనాతో పోల్చితే.. కరోనా స్ట్రయిన్ 75శాతం ఎక్కువ వేగంగా కదలటమే ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. ఈ లెక్కన… ఒక్క మహిళ చేసిన చిన్నపొరపాటు ఇప్పుడు ఏపీను కంగారు పెడుతోంది.