కరోనా తగ్గు ముఖం పడుతుందనే సమయంలో కొత్త యూకే స్ర్టయిన్ కరోనా వైరస్ భయం పుట్టిస్తుంది. ఇప్పటికే యూకేలో లక్షకు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఇటువంటి భయంకర పరిస్థితుల్లో హైదరాబాద్‌ను కొత్త కరోనా భయపెడుతోంది. మినీ ప్రపంచంగా పిలుచుకునే భాగ్యనగరంలో కొత్తగా 15 స్ట్రయిన్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల యూకే నుంచి నగరం వచ్చిన ఐదు విమానాల్లోని వారికి శంషాబాద్ విమానాశ్రయంలో పరీక్షలు చేయగా వీరిలో 15 మంది కొత్త వైరస్ బారినపడినట్టు తేలింది. దీంతో వారితో పాటు ముందు, వెనుక వరుసల్లో ప్రయాణించిన 300 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆ ప్రయాణికులు విమానం ఎక్కే 72 గంటల ముందు చేసిన వైద్యపరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది.. విమానం దిగేలోపుగానే పాజిటివ్‌గా తేలింది. ఇది కొత్త కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ లెక్కన.. బస్సు, రైలు, విమానం ఎక్కువ సమయం దేనిలో ప్రయాణించినా వైరస్ కు గురయ్యే అవకాశాలున్నట్టుగా దీన్ని బట్టి అర్ధమవుతోందంటూ శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు ఆందోళన పడుతున్నారు.