ఆదితో అమ్మతోడు అడ్డంగా నరికేస్తానంటే.. ఈలలతో థియేటర్లు మార్మోగాయి.. సింహాద్రి గొడ్డలి.. యమదొంగతో.. సింహంలా.. అదుర్స్‌తో నవ్వుల రారాజుగా.. ఆర్ ఆర్ ఆర్‌లో సీతారామరాజు స్నేహితుడు కొమరంభీమ్‌గా.. ఒకే ఒక్కడు.. దుమ్ము రేపుతున్నాడు. అతడే.. ఎన్టీఆర్. అభిమానులు ముద్దుగా పిలుచుకునే బుడ్డోడు.. ప్రేమకు తలవంచే తారక్. రామ్‌చరణ్‌తో కలసి సినిమా చేస్తూ.. అభిమానులకు గొప్ప సందేశం ఇచ్చారు. హీరోల మధ్య ఉండే స్నేహమే.. అభిమానులు కూడా అనుసరించాలని సూచిస్తున్నారు
పౌరాణికం.. జానపదం.. ఏ పాత్రలైనా అవలీలగా పోషించిన విశ్వవిఖ్యాతన నట సార్వభౌముడు.. నందమూరి తారకరామారావు. ఆ ఇంటి నుంచి మూడోతరంలో మెరుపులా మెరిసిన నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగిన మనువడిగా వడివడిగా అడుగులు వేస్తూ.. ఇప్పుడు వెండితెరకు బాద్‌షాగా మారాడు. 2001లో తొలిసారి హీరోగా మెరిసిన జూనియర్ ఎన్టీఆర్ వెండితరకు పరిచయమై.. నవంబరు 16కు అంటే ఈ రోజుకు 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తారక్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం.. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, తల్లి షాలినీ. 1983 మే 20 జన్మించారు. చిన్నపుడు కూచిపూడి నేర్చుకున్నారు. ఎంచక్కా.. బుద్దిగా.. పబ్లిక్‌గార్డెన్స్‌లోని జవహర్ బాలభవన్‌కు వెళ్లి మరీ కూచిపూడి నేర్చుకున్నారు. చిన్నపుడు సిగ్గుపడుతూ కనిపించేవాడంటూ నృత్యగురువులు చెబుతుంటారు. మనువడిలో క్రమశిక్షణ. ఆకట్టుకునే రూపం చూసిన ఆ నాటి సీఎం.. ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలనటుడుగా అవకాశం ఇచ్చారు.
పసితనంలో ఎన్నో చేదు అనుభవాలు చవిచూసినా.. అవన్నీ దాటుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడుగా రాణించేందుకు వారసత్వం మాత్రమే కాదు.. దమ్ము ఉండాలనేందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాడు. తాతతో కలసి తొలిసారి బాలనటుడుగా బ్రహ్మర్షి విశ్వామిత్రలో కనిపించిన ఈ బుడ్డోడు ఇంతింతై అన్నట్టుగా ఎదిగాడు. మొదటిసారి హీరోగా ఉషాకిరణ్‌మూవీస్ బ్యానర్‌పై నిన్నుచూడాలని సినిమాలో తెరంగేట్రం చేశారు. హీరోగా చేసినపుడు అతడి వయసు ఎంతో తెలుసా.. అక్షరాలా 17 ఏళ్లు. బొద్దుగా.. నూనూగు మీసాలతో జబ్బీగా కనిపించిన జూనియర్‌ను హీరోగా ఎన్టీఆర్ అంటే ఇలా ఉంటాడంటూ చూపిన దర్శకుడు రాజమౌళి. ఆదితో వి.వినాయక్ మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టారు. అక్కడ నుంచి వెను తిరిగి చూసే అవకాశం లేకుండా నటుడుగా విజృంభించాడు.. డ్యాన్స్‌లో తారక్ అంటే.. ఇదీ అని నిరూపించుకుంటూ లక్షలాది మంది అభిమానుల మనసు దోచుకున్నారు. ఆంధ్రవాలా, నాగ వంటి సినిమాలు నిరాశ పరిచాడు. బాగా లావు కావటంతో విమర్శలూ చవిచూశాడు. ఆ తరువాత కంత్రీలో కరెంటు తీగలాగా మెరిసి.. ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటెన్ చేస్తున్నాడు. టెంపర్‌తో దుమ్మురేపిన తారక్.. రాజమౌళి దర్శకత్వంలో.. కొణిదెల వారసుడు రామచరణ్ తో కలసి ట్రిపుల్ ఆర్‌తో మల్టీస్టారర్‌గా చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆమోదంతో లక్ష్మీప్రణీతను పరిణయమాడారు. అభయ్‌రామ్, భార్గవ్ ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలతో ముచ్చటైన కుటుంబంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.