రాజ్‌తరుణ్.. పక్కా గోదారి యాసలో ఇరగదీసే కుర్రాడు. మొదటి సినిమా ఉయ్యాలా.. జంపాలాతోనే హిట్ అందుకున్నాడు. మంచి ఈజ్ ఉన్న నటుడుగా నిరూపించుకున్నాడు. ఎనర్జిటిక్‌గా రవితేజను గుర్తుచేస్తుంటాడు. దర్శకుడు, రచయిత కూడా కావటం వల్ల డైలాగ్ డెలివరీలోనూ తనదైన బాడీలాంగ్వేజ్ కనిపిస్తుంది. అపుడపుడూ కొన్ని వివాదాల్లో తలదూర్చుతున్నా పర్వాలేద నిపించాడు. కొద్దినెలల క్రితం. ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద కారు నుంచి బయటకు దిగి పారిపోవటం వంటి ఘటనలు సీసీ కెమెరాల్లో చూసిన ప్రేక్షకులు కూడా ఉలికిపాటుకు గురయ్యారు. ఈ కుర్రహీరోకు మాంచి హిట్ దొరక్క చాలా కాలమే అయింది. 2013 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 20 సినిమాలు చేశాడు. కుమారి ఎఫ్ 21, సినిమా చూపిస్త మావ వంటి హిట్లు మరోసారి కావాల్సి ఉంది. కానీ వరుసగా రంగులరాట్నం, అంధగాడు, రాజుగాడు, లవర్ అంతగా పేరు తీసుకురాలేకపోయాయి. ఇద్దరి లోకం ఒక్కటే సినిమా వచ్చినట్టే తెలియదు. అందుకే.. ఈ సారి ఒరేయ్‌బుజ్జిగాతో కామెడీ.. మిక్స్ చేసి అలరిస్తానంటున్నాడు. అన్నీ బావుంటే.. థియేటర్లలో విడుదల కావాల్సిన సినిమా.. ఇప్పుడు కరోనా పుణ్యమాంటూ ఆహాలో శుక్రవారం విడుదల కాబోతుంది. హెబ్బాపటేల్ జంటగా నటించిన సినిమా రాజ్‌తరుణ్ ఆశలు ఎంత వరకూ నెరవేర్చుతుందో చూడాలి.