ఏయ్.. ఎందుకలా వణకిపోతున్నావ్. ఏమైందీ.. అసలు నీకేమైందీ. నిన్న.. మొన్న ఎప్పుడూ చూడని జ్వరాలా! ముందెన్నడూ కనిపించని కన్నీళ్లా! రోజూ వాటితో సహవాసం చేస్తూనే ఉంటావ్. అయినా అదేదో కొత్త అయినట్టు బాధపడుతుంటావు. 2019లో కరోనా అనగానే ఏమైందీ నీ భయం. భార్యపిల్లలతో గుట్టుగా నాలుగు గోడల మధ్యనే ఉన్నావు. ఐదారు నెలలకే అమ్మో నావల్ల కాదంటూ బయటకు వచ్చావ్. మార్చి వరకూ బాగానే ఉన్నావుగా.. పెళ్లిళ్లకు వెళ్లావు. క్రాక్, ఉప్పెన, వకీల్‌సాబ్ సినిమాలను ఆస్వాదించాం.. జాతిరత్నాలు చూసి పగలబడి నవ్వావు. ఇంతలో ఏమైందీ. నీ వాళ్లు.. పరిచయం ఉన్నవాళ్లు.. సహచరులు.. సహోదరులు.. ఎందుకిలా పిట్టల్లా రాలిపోతున్నారని ఆలోచిస్తున్నావా! ఇప్పుడే ఒక పెద్దాయన.. 80 ఏళ్ల వయసులో కొవిడ్ వచ్చిందనగానే రానీ నాయనా.. మా తాత మశూచి చూసి భయపడలేదు. మా అయ్య కలరా వచ్చినపుడు ధైర్యంగానే ఉన్నాడు. నేను కూడా ఆ నెత్తురు పంచుకున్న బిడ్డనే.. రైతు ఇంటి నుంచి వచ్చిన వాడినే.. కరోనా అనేది మూడోతరంలో నేను చూడబోతున్నదంటూ ధైర్యంగా డాక్టర్‌తో చెప్పి 14 రోజుల తరువాత మళ్లీ పొలం పనుల కోసం పారబట్టాడు.
మరి 20, 30, 40 ఏళ్లకే నీలో ఎందుకీ భయం. కుటుంబాన్ని సాకేందుకు.. తప్పిన సబ్జెక్టులు పాసయ్యేందుకు.. ఉద్యోగం దొరకనపుడు…. ఆకలితో పస్తులున్నపుడు కూడా నీ గుండెను తాకని నిరాశ.. నిర్వేదం ఎందుకు వస్తుంది. బేలచూపులతో నీ చుట్టూ నువ్వే విషవలయం నిర్మించుకుంటున్నావని నీకు తెలుసా! నిన్ను భయపెట్టేది కరోనా కాదు.. అంతకు మించిన నీలోని మానసిక బలహీనత. తాతలు, తండ్రులు గెలిచిన.. ఎదుర్కొంటున్న కరోనాకు నువ్వెందుకు భయపడతావ్. ఎంతో జీవితం.. ఇంకెంతో సాధించాల్సిన నువ్వు భయం వీడు.. ధైర్యంగా నిలబడు. ఒక్కసారి నీతో నువ్వే యుద్ధం చేయటం మొదలుపెట్టు. ఆలోచనలు వస్తే రానీ.. ఎవరో నిన్ను తరుముకువ స్తున్నారనే భావన కలగనీ.. అన్నింటినీ ఒకే సమాధానం.. నువ్వే. నీకు నువ్వే సమాధానం చెప్పుకో.. నీకు నువ్వే ధైర్యాన్ని మలచుకో.. ఏమంటావ్.. అయినా.. అమ్మ కడుపులో కోట్ల కణాలను ఎదురించి.. ఈదుకుంటూ వెళ్లి అమ్మ బొజ్జలోని పిండంతో జతకట్టావ్.. 9 నెలల బొడ్డు నుంచే ఊపిరి తీసుకున్నావ్. వెలుతురు లేని లోకంలో అమ్మ మాటలు వింటూ హాయిగా గడిపావు.. అంత ధైర్యంగా ఊపిరి పోసుకుని వచ్చిన నీకెందుకీ బేలతనం. ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకో.. నీ బలం నువ్వే తెలుసుకో.. ప్రపంచాన్ని జయించే సత్తా ఉన్న నీలో దాగిన ఆత్మవిశ్వాసంలో అణువంత ఉపయోగించు.



