అమెరికా.. భారత్‌కు స్నేహితుడు అని చెప్పలేం. ప్రత్యర్ధిగా భావించలేం. అగ్రదేశం ఏది చేసినా వ్యాపారం. వాణిజ్యం.. శత్రుదేశాలకు తగినట్టుగా విదేశాంగ విధానం ఉంటుంది. రష్యా పై పట్టు కోసం ఆఫ్గన్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. పాకిస్తాన్ వనరుల కోసం భారత్‌తో అంటీఅంటనట్టుగా ఉన్నారు. ప్రపంచ శక్తిగా చైనా ఎదిగే సమయంలో భారత్‌తో మైత్రి. ఇండియా బోర్డర్ వద్ద చైనాతో తలెత్తిన వివాదాలను అనువుగా మలచుకునేందుకు అమెరికా మనకు దగ్గరైంది. ఇప్పుడే కాదు దశాబ్దాలుగా పెద్దన్న పాత్ర ఇలాగే ఉంటుంది. అక్కడ అధ్యక్షుడుగా ఎన్నికైన ఎవరైనా అదే దారిలో నడుస్తుంటారు. గాకపోతే మార్కెటింగ్ టెక్నిక్స్ మారుస్తుంటారు. ట్రంప్ కూడా భారత్ నాకు మిత్రుడు అంటాడు.. కానీ ఇండియన్స్‌క వీసాల విషయంలో మెలికపెడతాడు. మెక్సికన్లను రానివ్వకుండా గోడ కడతానంటాడు. 2020 ఎన్నికల్లో గెలుపు అవకాశాలున్నా పరాజయం నుంచి తప్పించుకోలేకపోయాడు.
77 ఏళ్ల వయసులో అధ్యక్షుడుగా ఎంపికైన జో బైడెన్. ఇండియన్ల పట్ల ఎలా వ్యవహరిస్తారు. తన వైఖరి ఏ విధంగా ఉండబోతుంది. పాకిస్తాన్ పట్ల సానుకూలంగా ఉండే బైడెన్ భారత్‌తో మైత్రి.. చైనా పట్ల అనుసరించే విధానంపై ఇప్పటికే చర్చ మొదలైంది. నిజానికి బైడెన్ మంచి రాజకీయ వేత్త. మితవాదిగా మంచి గుర్తింపు ఉంది. యుద్ధానికి దూరంగా శాంతికే ఓటేస్తుంటాడు. 1991లో గల్ఫ్ యుద్ధాన్ని వ్యతిరేకించారు. అందాకా ఎందుకు అంతర్జాతీయ ఉగ్రవాది బిన్‌లాడెన్‌ను కలుగులో నుంచి బయటకు లాగి చంపాలనే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిన్‌లాడెన్ ఆలోచనను వ్యతిరేకించాడు. 2008లో అమెరికా ఉపాధ్యక్షుడుగా ఉన్న బైడెన్ పాకిస్తాన్‌కు 10వేల కోట్ల సైనికేతర సాయం అందించేందుకు సాయపడ్డారు. దానికి గానూ పాక్ ప్రభుత్వం.. హిలాల్ ఎ పాకిస్తాన్ పేరిట అందించే రెండో అత్యుత్తమ పౌర పురస్కారంతో గౌరవించింది.
మొన్నటి వరకూ అమెరికా అంటే భారత్ మిత్రదేశం అనే ముద్ర ఉంది. ట్రంప్ మాదిరిగా బైడెన్ భారత్ విషయంలో అంత ఉదారంగా ఉండకపోవచ్చు. అంతమాత్రాన చైనాకు దగ్గరవుతారని కూడా అనుకోలేం. ఎందుకంటే చైనా పట్ల అమెరికన్లలో చాలా వ్యతిరేకత ఉంది. ఒక విధంగా వారు భారత్‌కు సాయం చేయటాన్ని సమర్ధిస్తుంటారని ఒప్పుకోవాల్సిందే. భారతీయులకు హెచ్1బీ వీసాల అందజేతపై ఉదారంగా ఉంటామని బైడెన్ చెప్పినా అది వాస్తవంలో ఎంత వరకూ అమలు చేస్తారనేది కూడా ప్రశ్నగానే మిగిలింది. కాశ్మీర్ విషయంలోనూ బైడెన్ వర్గం వ్యతిరేకంగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దును అప్పట్లో డెమొక్రెట్లు వ్యతిరేకించటం గుర్తంచుకోవాలి.
జో బైడెన్ జీవితం చాలా మందికి స్పూర్తి. 1942 నవంబరు 20వ తేదీన ఐరిష్‌లోపుట్టారు. 1968లో లా డిగ్రీ చేతబట్టారు. పసితనంలో నత్తి సమస్యతో బాధపడే బైడెన్ తనకు తానుకు దాన్నుంచి బయటపడ్డారు. ఇప్పటికీ ఎంతోమంది నత్తివాళ్లకు క్లాసు తీసుకోవటం.. కౌన్సెలింగ్ ఇస్తుండటం చేస్తుంటారు. అమెరికా అధ్యక్ష పదవి కోసం మూడుసార్లు పోటీపడ్డారు. మొదటిసారి 1988, రెండోసారి 2008, ఇప్పుడు మూడోసారి 2020. ఒబామా ఏలుబడిలో ఉపాధ్యక్షుడుగా పనిచేసిన బైడెన్ ఇన్నేళ్లకు తన కల నెరవేర్చుకున్నారు. మందు, సిగరెట్లు వంటి దురలవాట్లు లేని బైడెన్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.