2019 ఫిబ్రవరి లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయాలనుకుంది. అది కూడా ఉగ్రవాదులతో దొంగదెబ్బతీయాలనే ఎత్తుగడలో ఊగిపోయింది. పుల్వమాలో ఉగ్రదాడి తరువాత పాక్‌పై భారత్ తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమైంది. దానిలో భాగంగానే బాల్‌కోట్‌లోని ఉగ్రమూక శిబిరాలపై దాడులు చేసింది. అంతే.. ఒక్కసారిగా రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారీగా సైన్యం.. వైమానికదళాల గర్జనతో ఇప్పుడో.. రేపో యుద్ధం అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. భారతీయ వైమానికదళం ఉగ్రవాద స్థావరాలపై దాడులు. ఇండియాను దెబ్బతీశామని జబ్బలు చరచుకునేందుకు పాక్ చేసిన దుందుడుకు చర్య తమను ఎంతగా భయాందోళనకు గురిచేస్తుందో తెలుసుకోలేకపోయారు. అప్పటికే భారత్ చూస్తూ ఊరుకోలేదు. గట్టిగా బదులిచ్చేందుకు త్రివిధ దళాలకు సంకేతాలు వెళ్లాయి. మూడు దళాలు సమన్వయం చేసుకుంటూ పాకిస్తాన్‌కు తిరుగులేని గుణపాఠంచెప్పాలనే నిర్ణయానికి వచ్చాయి. అటువంటి సమయంలో పాకిస్తాన్ విమానాలు.. భారత్ భూబాగంలోకి రావటంతో భారత్ యుద్ధవిమానాలు వెంటాడటంతో తోకముడిచాయి. వెళ్తూ..వెళ్తూ ఏవో రెండు బాంబులు వేశాయి. అసలే కాకమీదున్న భారతీయ సైనికులను మరింత రెచ్చగొట్టినంత పనిచేశాయి. జూలు పట్టి లాగితే సింహాలు ఊరుకుంటాయా! అందులోనూ భారతీయ సింహాలు.. అసమాన ధైర్యం.. నిరుపమానమైన పరాక్రమాలతో పాకిస్తాన్‌ను దెబ్బతీసేదుకు సిద్ధమయ్యాయి
ఫిబ్రవరి 25 నుంచే వైమానికదళం అప్రమత్తమైంది. అలా.. ఫిబ్రవరి 26న పాకిస్తాన్ యుద్ధవిమానాన్ని కూల్చివేసిన భారతీయ యుద్ధవిమానం మిగ్ కూడా కుప్పకూలింది. పారాచూట్ ద్వారా వింగ్‌కమాండర్ వర్దమాన్ అభినందన్ సురక్షితంగా కిందకు దిగారు. అయితే.. అభినందన్ దిగింది పాకిస్తాన్ భూబాగంలో. వెంటనే అప్రమత్తమైన ఆ దేశ సైన్యం.. అభినందన్‌ను కస్టడీలోకి తీసుకోవటం.. దాడి చేయటం.. భారతీయ వాయుసేనకు సంబంధించిన అంశాలు బయటకు లాగాలని ప్రయత్నిం చటం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. పాకిస్తాన్ తాను చేసింది.. ఎంత పెద్దతప్పనేది అప్పటికి తెలిసిందీ. అభినందన్‌ను యుద్ధఖైదీగా తీసుకెళ్లిన పాకిస్తాన్ వెంటనే విడుదల చేయాలంటూ భారత్ అల్టిమేటం జారీచేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం మొదట మేకపోతు గాంబీర్యం ప్రదర్శించింది. అదే పాక్ చేసిన అతి పెద్ద సాహసం. అప్పటికే నాటి వైమానిక చీఫ్ దనోవా తన వ్యూహానికి పదను పెడుతున్నారు. మరో వైపు ప్రధానమంత్రి నరేంద్రమో.. రక్షణశాఖ మంత్రులు ఎవరికి వారే అభినందన్‌ను 24 గంటల్లో ఇండియా బోర్డర్ దాటించాలనే పట్టుదలతో ఉన్నారు.
అభినందన్ విడుదల చేయకపోతే.. ఏకకాలంలో పాక్‌లోని ప్రధాన నగరాలపై దాడి చేయటం.. పాక్ ఆర్మీకు బుద్దిచెప్పటంపై ధనోవా దృష్టిపెట్టారని తానే స్వయంగా వెల్లడించారు. పాకిస్తాన్ భారత్‌పై దాడి చేసి ఉన్నట్టయితే.. ఆ దేశ సైనిక భూబాగాలన్నీ దాదాపు తుడిచిపెట్టుకుపోయేవంటూ నాటి తమ ఎత్తుగడల ఫలితాన్ని దనోవా చెప్పుకొచ్చారు. అభినందన్‌ను విడిచిపెట్టే ముందు రోజు పాక్ ఆర్మీ చీఫ్ కాళ్లు ఎంతగా వణికాయో.. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ పట్టణాల్లో జనం బిక్కుబిక్కుమంటూ ఎలాగడిపారనేది ఆ దేశ మంత్రులు స్వయంగా ఒప్పుకుంటున్నారు. ఈ ఒక్క మాట చాలు.. భారత్ సైనిక శక్తి ఎంత అమోఘమైనదో.. ఎంతటి అజేయమైనదని చాటేందుకు అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. చైనా యుద్ధానికి కాలుదువ్వుతున్నా.. ఇండియన్ ఆర్మీ అంటే ఉన్న ఆ ఒక్క భయమే చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీను బోర్డర్ దాటకుండా చేస్తుందంటూ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాక్‌లో తలెత్తిన రాజకీయ వైరంతో ఎట్టకేలకు ఆ దేశ మంత్రి ఖురేషీ పరోక్షంగా తమను భారత్ వైమానిక దళం.. ముఖ్యంగా అభినందన్ వర్దమాన్ పట్టివేత ఎంతగా భయపెట్టిందో చెప్పకనే చెప్పినట్టయింది. బాల్‌కోట్‌తో సహా భారత్‌లో జరిగే ప్రతి ఉగ్రదాడి వెనుక తామే ఉన్నట్టు అంగీకరించినట్టుగా మారింది.