నిజం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. అబద్దం అంత అందంగా.. ఆనందంగా అనిపించకపోవటంతో చాలా మందికి రుచించదు. ఇప్పుడు అదే జరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వరద ముంపు బాధితుల సహాయార్ధం రూ.కోటి విరాళం ప్రకటించారు. మెగా ఫ్యామిలీ మొత్తం దాదాపు రూ.6 కోట్ల వరకూ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చినట్టు అంచనా. నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఇలా కొందరు స్పందించారు. మరికొందరు.. ఆలోచనలో పడ్డారు. ఇటువంటి సందిగ్థ స్థితిలో డబ్బున్నోళ్ల మత్తు వదిలేలా పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అందరూ అనుకున్నట్టుగా సినిమా వాళ్లకు పేరొచ్చినంత తేలికగా డబ్బు రాదని చెప్పకనే చెప్పాడు. స్టార్ ఇమేజ్ ఉన్నంత మాత్రాన కోట్లరూపాయలు బీరువాల్లో మూలుగుతున్నాయనే భ్రమ నుంచి బయడపడాలంటూ చిన్నపాటి చురక కూడా వేశారు.
ఇక్కడ విశేషమేమిటంటే.. హైదరాబాద్‌కు ఇంత పెద్ద కష్టం వచ్చినపుడు స్పందించాల్సిన వారు ఎవ్వరూ ముందుకు రాలేదు. ముఖ్యంగా రాజకీయ, వ్యాపార వేత్తలు ఏ ఒక్కరిద్దరో మినహా ఏ ఒక్కరూ.. సాయం చేస్తామనో.. చేసినట్టుగానే ఆనవాళ్లు లేవు. జనసేనాని కూడా దీనిపైనే గురిపెట్టారు. డబ్బు బాగా ఉన్న వర్గాలు స్పందిస్తే బావుటుందంటూ సూచన చేశారు. కనీసం రాజకీయాల్లో పెట్టుబడిగా అయినా భావించి ముందుగానే విరాళం ఇవ్వమన్నారు. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చుపెట్టే రాజకీయ నాయకులు రేపటి తమ భవిష్యత్ కోసమైనా ఆ సొమ్ములు ఉపయోగపడతాయనే సూచన కూడా దాగుంది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్ధి రూ.60 కోట్లు, ఎంపీ అభ్యర్థులైతే ఏకంగా వంద కోట్ల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. అంత ఖర్చు చేసి చట్ట సభలకు వెళ్లాక.. దానికి వడ్డీ.. చక్రవడ్డీలతో కాంట్రాక్టులు, కమీషన్లతో బొక్కేస్తుంటారు. తరాల తరబడి తిన్నా తరగని ఆస్తి కూడబెడుతున్నారు. లేకపోతే.. డొక్కు స్కూటర్ మీద తిరిగిన చోటానేత కార్పోరేటర్ కాగానే ఫార్చ్యునర్‌లో మందీ మార్బలంతో చక్కర్లు కొడుతున్నాడు. అలాంటిది ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు ఇంకెంతగా కూడబెట్టి ఉంటారనేది అర్ధమవుతుంది. అప్పనంగా సంపాదించిన సొత్తులో కొంతైనా ఇవ్వాలనేది పవన్ సూచన కూడా కావచ్చు.
హైదరాబాద్ ఇదొక విశ్వగ్రామం. అమలాపురం వాసి నుంచి ఆఫ్రికన్ వరకూ ఉపాధి నిస్తుంది. బతుకుదెరువు చూపుతుంది. చాలా మంది ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు ఎవర్ని కదిలించినా తమ ఉన్నతికి భాగ్యనగరమే బాట వేసిందంటారు. ఇటువంటి మహానగరానికి కష్టం వచ్చినపుడు స్పందించాల్సిన వీరంతా ఏమయ్యారు. కనీసం తమ వంతుగా ఏమైనా సాయం చేయాలనే ఆలోచన కూడా చేయలేకపోతున్నారు. సినీ తారలే ఎందుకు ముందుకు రావాలి. మిగిలిన వారంతా కోట్లు సంపాదించట్లేదా! వినోదాన్ని పంచుతూ దానికి ఫీజు తీసుకుంటున్నారు సినీ నటులు, డాక్టర్లు, లాయర్లు, పారిశ్రామిక వేత్తలు మాదిరిగా వాళ్లు కూడా తమ కళతో వ్యాపారం చేస్తున్నారు. ఏ ఒక్కరో స్పందించటం కాదు.. అందరం కలసి హైదరాబాద్‌ను రక్షిద్దామనేది సేనాని అంతరంగం. మరి పవన్ కళ్యాణ్ అన్న మాటలతో అయినా మల్టీ మిలియనీర్ల మనసు కరగుతుందో.. ఆక్రోశంతో జనసేనాని తప్పులు వెతికే పని మొదలు పెడతారో చూద్దాం!!



